TSPSC Paper Leakage Update : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులోకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగప్రవేశం చేసింది. ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి వాంగ్మూలాలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈడీ అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. నిందితుల వాంగ్మూలాల నమోదుకు అనుమతి ఇవ్వాలని కోరారు.
ED inquiry in TSPSC paper leak : ప్రశ్నపత్రాల లీక్ కోసం భారీగా నగదు చేతులు మారినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అనుమానిస్తున్నారు. మనీ లాండరింగ్ జరిగినట్లు అంచనా వేస్తున్నారు. సిట్ అధికారులు సాక్షిగా పేర్కొన్న కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ శంకరలక్ష్మిపై ఈడీ ప్రధానంగా దృష్టి సారించింది. ఈ క్రమంలోనే శంకరలక్ష్మితో పాటు కమిషన్‌కు చెందిన సత్యనారాయణకు నోటీసులు ఇచ్చింది. బుధ, గురువారాల్లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. మరోవైపు ప్రవీణ్, రాజశేఖర్‌లను కస్టడీకి తీసుకొని విచారించనుంది.
SIT Report to Telangana HC in paper leak case..: ఇదిలా ఉండగా.. ఈ కేసులో నెల రోజుల పాటు దర్యాప్తు కొనసాగించిన సిట్ అధికారులు.. మొత్తం 17 మందిని అరెస్ట్ చేశారు. వారిలో 15 మందిని కస్టడీకి తీసుకుని పలు వివరాలు రాబట్టారు. దాదాపు 150 మందిని విచారించిన అధికారులు.. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, సెక్రటరీ సహా పలువురి వాంగ్మూలాలు నమోదు చేశారు. ఈ మొత్తం నివేదికను నేడు హైకోర్టుకు సమర్పించనున్నారు. దర్యాప్తు నివేదికలో నిందితుల పెన్‌డ్రైవ్, మొబైల్స్‌లో ప్రశ్నపత్రాలు ఉన్నట్లు రూపొందించిన ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదికనూ జతపరిచారు.
ఉద్యోగాలు అమ్మేసుకుంటూ పోతే ఎలా..: మరోవైపు ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వ తీరుపై విపక్షాలు సహా పలువురు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో తాజాగా ప్రముఖ నటుడు ఆర్.నారాయణమూర్తి స్పందించారు. పేపర్ లీకేజీలతో విద్యార్థి, నిరుద్యోగుల ఆశలు నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. ఈ ఉదంతంతో నిజంగా చదివే వారి పరిస్థితి అధ్వానంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఉద్యోగాలు అమ్మేసుకుంటూ పోతే.. నిజమైన విద్యార్థుల భవిష్యత్ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.