Sanjay raut ED: శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇప్పటికే రెండుసార్లు ఈడీ నోటీసులు అందుకున్న ఆయన.. విచారణకు హాజరుకాలేదు. జులై 27న ఈడీ కార్యాలయానికి రావాలని కోరగా.. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో హాజరు కాలేనని చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆదివారం ఆయన ఇంట్లో ఈడీ తనిఖీలు నిర్వహించడం గమనార్హం.
ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో సీఐఎస్‌ఎఫ్ అధికారులతో పాటు ఈడీ బృందం ముంబయిలోని రౌత్ ఇంటికి చేరుకుంది. పాత్రచాల్ భూ కుంభకోణానికి సంబంధించి అక్రమ నగదు చలామణి కేసులో రౌత్‌ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈడీ అధికారుల సోదాలపై సంజయ్ రౌత్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు.
"ఎట్టి పరిస్థితుల్లో శివసేనను వీడేది లేదు. చనిపోయినా సరే.. నేనెవరికీ తలొగ్గబోను. నాకు ఎలాంటి కుంభకోణంతో సంబంధం లేదు. బాలాసాహెబ్ ఠాక్రేపై ప్రమాణం చేసి ఈ విషయం చెబుతున్నాను. బాలాసాహెబ్ మాకు ఎలా పోరాడాలో నేర్పారు. శివసేన కోసం పోరాటం కొనసాగిస్తూనే ఉంటా" అని ట్వీట్ చేశారు.