ED Notice to Arvind Kejriwal :లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. నవంబర్ 2న తమ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే ఆప్ మంత్రులు ఈ కేసులో అరెస్టైన నేపథ్యంలో.. తాజాగా కేజ్రీవాల్‌కు నోటీసులు పంపడం చర్చనీయాంశంగా మారింది.
'స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాం'
Delhi Liquor Case Arvind Kejriwal :మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద కేజ్రీవాల్‌కు నోటీసులు పంపినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. దిల్లీ కార్యాలయంలోని దర్యాప్తు అధికారి ముందు హాజరైతే ఆయన స్టేట్మెంట్ను ఈడీ రికార్డు చేయనుందని వెల్లడించాయి. కాగా, కేజ్రీవాల్‌కు సమన్లు పంపించడంపై ఆప్ మండిపడింది. ఇది కేంద్ర ప్రభుత్వం చేసిన కుట్ర అని ధ్వజమెత్తింది.
"కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈడీ.. దిల్లీ ముఖ్యమంత్రికి సమన్లు పంపిందని వార్తల ద్వారా తెలిసింది. దీన్ని బట్టి చూస్తే.. ఎలాగైనా ఆమ్ ఆద్మీ పార్టీని అంతం చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని అర్థమవుతోంది. కేజ్రీవాల్‌పై తప్పుడు కేసు పెట్టడానికి ఏ అవకాశాన్నీ వారు వదలి పెట్టడం లేదు. ఆప్‌ను పూర్తిగా అంతం చేయాలని అనుకుంటున్నారు."
-సౌరభ్ భరద్వాజ్, ఆప్ నేత, దిల్లీ మంత్రి