ED Letter to MLC Kavitha: దిల్లీ మద్యం కుంభకోణంలో విచారణలో.. భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అందించిన సెల్‌ఫోన్లను ఈడీ అధికారులు తెరిచినట్లు తెలుస్తోంది. విచారణలో ఆమె సెల్‌ఫోన్ల నుంచి ఈడీ అధికారులు డేటా సేకరించినట్లు సమాచారం. అంతకుముందే దీనిపై ఎమ్మెల్సీ కవితకు ఈడీ జాయింట్ డైరెక్టర్ లేఖ రాశారు. కవిత అందించిన మొబైల్ ఫోన్లను తెరిచేందుకు సిద్దమయ్యామని లేఖలో తెలిపిన ఈడీ జాయింట్ డైరెక్టర్... ఫోన్లు ఓపెన్ చేసేటప్పుడు స్వయంగా హాజరుకావడం లేదా తన ప్రతినిధిని పంపాల్సిందిగా పేర్కొన్నారు.
దీంతో... కవిత తరపున బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ మంగళవారం ఈడీ ఎదుట హాజరయ్యారు. నిన్న ఉదయం 11.30కు ఈడీ కార్యాలయంలోకి వెళ్లిన ఆయన సాయంత్రం 5 గంటలకు బయటకు వచ్చారు. డేటా సేకరణ, సోమ భరత్ నుంచి కొంత సమాచారం సేకరించిన తర్వాత ఈడీ అధికారులు ఆయనను పంపించేశారు. ప్రస్తుతం దర్యాప్తు పురోగతిలో ఉన్నందున ఎలాంటి విషయాలు చెప్పబోనని సోమ భరత్ తెలిపారు.
ఫోన్లను ధ్వంసం చేశానని ఈడీ దురుద్దేశపూర్వకంగా తనపై తప్పుడు ఆరోపణలు చేసిందన్న కవిత.. ఈనెల 21న వాటిని నేరుగా తీసుకెళ్లి ఈడీకి ఇచ్చారు. ఇలా ఇవ్వడానికి వెళ్లే ముందు ఇంటి దగ్గర.. ఆఫీసు దగ్గర వాటిని మీడియా ఎదుట చూపించారు. తాను ఫోన్లను ధ్వంసం చేయలేదంటూ విచారణ అధికారికి అప్పుడు ఎమ్మెల్సీ కవిత ఓ లేఖ కూడా రాశారు.