Delhi ED call MP Magunta in liquor scam: దిల్లీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ఒంగోలు వైసీపీ ఎంపీ శ్రీనివాసులు రెడ్డికీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నేడు నోటీసులు జారీ చేసింది. జారీ చేసిన నోటీసులో ఈనెల 18వ తేదీన విచారణకు రావాలని మాగుంటను ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులో మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవ రెడ్డి అరెస్టై జైలులో ఉన్నారు.
ఈ క్రమంలో ఈడీ దిల్లీ మద్యం కుంభకోణంలో సిండికేట్ ఏర్పాటు, ముడుపులు ముట్టజెప్పడంలో.. మాగుంట రాఘవ్ కీలకపాత్ర పోషించారని ఈడీ ఇప్పటికే స్పష్టం చేసింది. దిల్లీ మద్యం విధానంలో మద్యం ఉత్పత్తిదారులకు రిటైల్ జోన్లు ఉండరాదనే నిబంధనకు విరుద్ధంగా.. మాగుంట ఆగ్రో ఫామ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో దిల్లీలో రెండు రిటైల్ జోన్లను రాఘవ తన గుప్పిట్లో పెట్టుకున్నారని ప్రస్తావించింది. మాగుంట ఆగ్రోఫామ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ భాగస్వాములుగా కాగితాల్లో పేర్కొన్న పేర్లన్నీ డమ్మీలేనని ఈడీ ఇప్పటికే కోర్టుకు తెలిపింది. తండ్రి మాగుంట శ్రీనివాసులు రెడ్డి ద్వారానే రాఘవ్.. మద్యం వ్యాపారంలో భాగస్వామ్యం దక్కించుకున్నట్లు ఈ కేసులో నిందితుడుగా ఉన్న సమీర్ మహేంద్రు స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు ఈడీ తెలిపింది.
అనంతరం కొత్త మద్యం విధానాన్ని అనుసరించి దిల్లీలో మద్యం వ్యాపారం చేయడానికి తాను చాలా ఆసక్తితో ఉన్నానని, ఇక్కడ వ్యవహారాలన్నీ రాఘవ్ చూసుకుంటారని శ్రీనివాసులు రెడ్డి అన్నట్లు..కేసులో మరో నిందితుడు అరుణ్ పిళ్లై చెప్పారని ఈడీ తెలిపింది. మద్యం విధానంలోని విషయాలను లోతుగా తెలుసుకోవడానికి తాను దిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో సమావేశమయ్యానని, ఇక్కడి వ్యాపారంలోకి ఆయన తనను ఆహ్వానించారని శ్రీనివాసులు రెడ్డి తమతో అన్నట్లు అరుణ్ పిళ్లై స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు.