MLC Kavitha ED Investigation In Delhi Liquor Case: దిల్లీ సర్కారు రూపొందించిన మద్యం విధానాన్ని అనుకూలంగా మలచుకొని అనుచిత లబ్ధి పొందారనే ఆరోపణలపై ఈడీ.. ఇప్పటికే పలువురు నిందితులు, సాక్షులను ప్రశ్నించింది. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు శనివారం సుమారు 8 గంటలు ప్రశ్నించారు. ఉదయం దిల్లీ తుగ్లక్ రోడ్డులోని సీఎం కేసీఆర్ నివాసంలో మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్.. కవితతో సమావేశమై చర్చించారు. తర్వాత భర్త అనిల్, తమ న్యాయవాదులతో కలిసి కవిత ఈడీ వద్దకు వెళ్లారు.
అప్పటికే అక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు పిడికిలి బిగించి అభివాదం చేసి ఈడీ కార్యాలయంలోకి వెళ్లారు. శనివారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆమెను ఈడీ అధికారులు విచారించారు. సాయంత్రం 4 గంటలకు భోజన విరామం ఇవ్వడంతో గంటపాటు విచారణ జరిపిన గది నుంచి బయటకు వచ్చి.. తిరిగి విచారణకు హాజరయ్యారు. సాయంత్రం 5 గంటల నుంచి మొదలైన విచారణ రాత్రి 8 గంటలకు ముగిసింది.
అన్ని ప్రశ్నలు సాధారణ అంశాలపైనే: తొలి రోజు కవిత విచారణ అంతా సాధారణ అంశాలపైనే సాగినట్లు తెలిసింది. ప్రస్తుతం కస్టడీలో ఉన్న మిగతా నిందితులను కవిత ముందు కూర్చోబెట్టి వివరాలను రాబట్టే ప్రయత్నం చేయలేదని సమాచారం. తదుపరి దశలో ఆ పని చేయనున్నట్లు తెలిసింది. విచారణలో తనపై వచ్చిన ఆరోపణలను ఆమె ఖండించినట్లు సమాచారం. దిల్లీ మద్యం పాలసీ రూపకల్పన, ముడుపుల గురించి తనకు తెలియదని కవిత పేర్కొన్నట్లు తెలిసింది.
బుచ్చిబాబు, అరుణ్‌పిళ్లైలు వ్యక్తిగతంగా తెలిసినా, వారి వ్యవహారాలతో తనకు సంబంధం లేదని సౌత్‌గ్రూప్, ఇండోస్పిరిట్ సంస్థలతో ఎలాంటి సంబంధం లేదని ఆమె సమాధానం ఇచ్చినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. పీఎంఎల్ఏ సెక్షన్ 50 కింద కవిత చెప్పిన సమాధానాలు అన్నింటిని లిఖిత పూర్వకంగా స్టేట్మెంట్ను రికార్డు చేసినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఈడీ అధికారులు కవిత ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం సాగినా.. ఆ విషయం ఇంకా నిర్ధారణ కాలేదు. విచారణ తర్వాత బయటకు వచ్చిన తర్వాత కవిత పిడికిలి బిగించి చూపారు. అనంతరం ప్రత్యేక విమానంలో రాత్రి హైదరాబాద్కు చేరుకున్నారు.