దిల్లీ మద్యం కుంభకోణం కేసులో భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఇప్పటికే 11 మందిని అరెస్టు చేసిన ఈడీ ఇవాళ కవితను ప్రశ్నించింది. వాస్తవానికి ఈనెల 9నే కవిత విచారణకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ ముందస్తు కార్యక్రమాల వల్ల రెండురోజుల తర్వాత హాజరవుతానని ఆమె ఈడీకి సమాచారమిచ్చారు. ఈ మేరకు ఉదయం దిల్లీ తుగ్లక్ రోడ్డులోని సీఎం కేసీఆర్ నివాసంలో తెలంగాణ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్.. కవితతో సమావేశమై చర్చించారు. ఆ తర్వాత భర్త అనిల్, తమ న్యాయవాదులతో కలిసి కవిత ఈడీ కార్యాలయానికి బయలుదేరారు. కాసేపటికే అక్కడకు చేరుకున్న ఆమె అప్పటికే అక్కడ ఉన్న బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలకు తన పిడికిలి బిగించి అభివాదం చేసి 11గంటల సమయంలో ఈడీ కార్యాలయంలోకి వెళ్లారు.
అప్పటి నుంచి సాయంత్రం నాలుగింటివరకు కవితను ప్రశ్నించిన అధికారులు భోజనం కోసం విరామమిచ్చారు. ఓ గంట విరామం తర్వాత ఐదింటికి మళ్లీ విచారణ చేపట్టారు. ఈ విచారణలో తొలుత కవిత మాజీ చార్టర్డ్ అకౌంటెంట్ బుచ్చిబాబు, మద్యం కేసులో ఆమెకు బినామీగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అరుణ్ రామచంద్ర పిళ్లై ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ఈడీ అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ సమయంలోనే డిజిటల్ ఆధారాలు లభించకుండా ధ్వంసం చేయడం, హైదరాబాద్‌లో జరిగిన సమావేశాలు, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియాలతో భేటీలపై కూడా ఆరా తీసినట్లు సమాచారం. తర్వాత అరుణ్ పిళ్లైతో కలిపి ప్రశ్నించినట్టు తెలుస్తోంది.
రెండో విడతలో సాయంత్రం ఐదింటి నుంచి 8గంటల వరకు కవితను ప్రశ్నించిన ఈడీ అధికారులు..ఆమె చెప్పిన వివరాలతో రూపొందించిన పత్రాలపై సంతకాలు తీసుకున్నట్టు తెలిసింది. ఆ తర్వాత ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన కవిత.. అక్కడే ఉన్నపార్టీ కార్యకర్తలకు కార్లోంచే అభివాదం చేసుకుంటూ తుగ్లక్ రోడ్‌లోని కేసీఆర్ నివాసానికి వెళ్లారు. అక్కడ కొద్ది నిమిషాలు ఉన్న కవిత.. ప్రత్యేక విమానంలో నేరుగా హైదరాబాద్ పయనమయ్యారు. ఆమె వెంట మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్ గౌడ్ కుడా ఉన్నారు. ఈనెల 16న మరోసారి విచారణకు రావాలని ఈడీ అధికారులు కవితకు మళ్లీ నోటీసులు ఇచ్చారు.
దేశంలో రెండేళ్లుగా ప్రకంపనలు రేపుతున్న దిల్లీ మద్యం కుంభకోణం కేసులో తాజా పరిస్థితులు ఉత్కంఠను రేపుతున్నాయి. దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఈడీ, సీబీఐ.. పలు రాజకీయ, ఆర్థిక, నేరపూరిత వ్యవహారాలను వెలుగులోకి తేవటంతో పాటు హైదరాబాద్ కేంద్రంగానే ఈ స్కామ్ జరిగినట్లు ఆరోపించింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే 11 మందిని అరెస్టు చేయగా.. తాజాగా ముఖ్యమంత్రి కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను విచారించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కవిత విచారణ దృష్ట్యా ఈడీ కేంద్ర కార్యాలయం పరిసరాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలు, నేతలు ఈడీ కార్యాలయానికి చేరుకోకుండా ముమ్మర భద్రతా చర్యలు తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు.