ED ATM of BJP: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌పై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. ఆ సంస్థకు చెందిన అధికారులు కొందరు భాజపాకు ఏటీఎంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. నలుగురు ఈడీ అధికారుల అవినీతిపై ముంబయి పోలీసులు దర్యాప్తు చేపట్టారని.. త్వరలోనే కొందరు జైలుకు వెళ్తారని అన్నారు.
Enforcement Directorate Sanjay Raut
ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన రౌత్.. ముంబయి పోలీసులు అవినీతి, దోపిడీ రాకెట్‌పై వేర్వేరు కేసులు నమోదు చేశారని తెలిపారు. పీఎంసీ బ్యాంకు కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాకేశ్ వధ్వాన్కు భాజపా నేత కృతి సోమైయాకు చెందిన వ్యాపారాలకు మధ్య సంబంధాలపై దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు.
Raut on ED BJP
"ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏ కంపెనీపై రైడ్లు చేసినా.. డబ్బును మాత్రం జితేంద్ర నవ్లానీకి చెందిన కంపెనీకి బదిలీ చేస్తోంది. ఆ కంపెనీలకు ఆఫీసులు ఉండవు, సిబ్బంది ఉండరు. నవ్లానీకి చాలా మంది భాజపా నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈడీ, ఆ శాఖకు చెందిన కొందరు అధికారులు భాజపాకు ఏటీఎంలా మారారు. ఓ మాజీ ఈడీ అధికారి భాజపా టికెట్‌పై ఎన్నికల్లోనూ పోటీ చేశారు. 50 మంది పార్టీ అభ్యర్థుల ఖర్చులను భరించారు. ఈ వివరాలన్నింటినీ పీఎంఓ(ప్రధాని కార్యాలయం)కు పంపించా. నా మాటలు గుర్తుపెట్టుకోండి. కొందరు ఈడీ అధికారులు తప్పక జైలుకు వెళ్తారు."