ED grills Channi: పంజాబ్ మాజీ సీఎం, కాంగ్రెస్ నేత చరణ్‌జిత్ సింగ్ చన్నీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి మనీ లాండరింగ్ కేసు విచారణలో భాగంగా.. ఆయనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది. అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కింద చన్నీ వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. 6 గంటలు ప్రశ్నించిన తర్వాత.. జలంధర్‌లోని ఈడీ జోనల్ కార్యాలయం నుంచి బుధవారం రాత్రి ఆలస్యంగా చన్నీని తిరిగి పంపించినట్లు వెల్లడించారు.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఇదే కేసులో.. చన్నీ మేనల్లుడు భూపిందర్ సింగ్ హనీని ఈడీ అరెస్టు చేసింది. హనీ సహా మరికొందరిపై జలంధర్‌లోని పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టులో మార్చి 31న ఛార్జిషీట్ దాఖలైంది. ప్రస్తుతం జుడీషియల్ కస్టడీలో ఉన్న చన్నీ మేనల్లుడు.. ఇటీవలే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మేనల్లుడు హనీ, ఇతరులతో సంబంధాలు, సీఎం క్యాంపు కార్యాలయానికి ఆయన పలుమార్లు రావటంపై చన్నీని ప్రశ్నించినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఇసుక అక్రమ తవ్వకాల్లో భాగంగా.. పలువురు అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లకు సంబంధించిన ఆరోపణలపైనా చన్నీని ఆరా తీసినట్లు సమాచారం.