ED Attack West Bengal : బంగాల్లో ఈడీ అధికారుల బృందంపై శుక్రవారం దాడి జరిగింది. రేషన్ పంపిణీ స్కామ్ కేసులో ఉత్తర 24 పరగణాలు జిల్లా సందేశ్‌ఖాలీలోని టీఎంసీ నేత షేక్ షాజహాన్ ఇంటికి వెళ్లిన అధికారులపై అతడి అనుచరులు దాడి చేశారు. పెద్ద సంఖ్యలో గుమిగూడిన టీఎంసీ మద్దతుదారులు- ఈడీ అధికారులతో పాటు వారి వెంట వచ్చిన కేంద్ర బలగాలను చుట్టుముట్టారు. అనంతరం వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఈడీ అధికారుల వాహనాలు సైతం తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఏజెన్సీకి చెందిన ఇద్దరు అధికారులు గాయపడ్డారు.
రేషన్ పంపిణీ స్కామ్ కేసులో ఇదివరకే అరెస్టయిన రాష్ట్ర మంత్రి జ్యోతిప్రియో మల్లిక్‌కు షేక్ షాజహాన్ అత్యంత సన్నిహితుడు అని అధికారులు తెలిపారు. 'ఎనిమిది మంది దుండగులు ఘటనాస్థలికి వచ్చారు. మా బృందంలోని ముగ్గురు సభ్యులం అక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాము. ఈ క్రమంలో వారు మాపై దాడికి దిగారు' అని దాడి సమయంలో ఈడీ బృందంలో ఉన్న సభ్యుడు తెలిపారు.
"ఈడీ అధికారులు 15 చోట్ల సోదాలు చేస్తున్నారు. అందులో షేక్ షాజహాన్ ఇల్లు కూడా ఒకటి. ఈ దాడిలో ఓ అధికారి తలకు గాయమైంది. ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లాం. ఇలాంటి దాడి గతంలో ఎప్పుడూ జరగలేదు. షేక్ షాజహాన్‌కు సంబంధించిన నివేదికను దిల్లీ కార్యాలయానికి పంపించాం."
- ఈడీ అధికారులు
బీజేపీ విమర్శలు
ఈడీ అధికారులపై దాడిని బీజేపీ నేతలు ఖండించారు. టీఎంసీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. "దాడి జరిపించిన వారిపై అవినీతి ఆరోపణలు, కేసులు ఉన్నాయి. ఇందులో భాగంగానే ఈడీ సోదాలు నిర్వహించేందుకు టీఎంసీ నేతల ఇళ్లకు వెళ్లింది. దీనిని చూస్తుంటే రోహింగ్యాలు రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో ఏం చేస్తున్నారో స్పష్టంగా అర్థం అవుతోంది" అని బంగాల్ బీజేపీ చీఫ్ సుకాంత మజుందార్ ధ్వజమెత్తారు.