హవాలా కేసులో ఆరోగ్య శాఖ మంత్రి అరెస్ట్ - ఈడీ
19:25 May 30
హవాలా కేసులో ఆరోగ్య శాఖ మంత్రి అరెస్ట్
దిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ అరెస్టు చేసింది. కోల్‌కతా కేంద్రంగా పనిచేసే ఓ సంస్థతో సంబంధమున్న హవాలా కేసులో ఆయన్ను సోమవారం అదుపులోకి తీసుకుంది. జైన్ కుటుంబం, కంపెనీలకు చెందిన రూ.4.81 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా అటాచ్ చేసినట్లు గత నెలలో ఈడీ పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి 2018లోనే సత్యేంద్రను ప్రశ్నించింది ఈడీ.
మరోవైపు, ఈడీ తీరుపై దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్షాలను బెదిరింపులకు గురిచేసేందుకు భాజపా సర్కారు... కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను వాడుకుంటోందని ఆయన మండిపడ్డారు. త్వరలోనే సత్యేందర్ జైన్‌ను ఈడీ అరెస్టు చేయనుందని తమకు సమాచారం ఉన్నట్లు పంజాబ్ ఎన్నికల ముందే కేజ్రీవాల్ తెలిపారు. సత్యేందర్, తనతోపాటు మరో మంత్రి మనీశ్ సిసోడియాపై కూడా ఈడీ దాడులు జరగవచ్చని అప్పట్లో కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
ఈ వ్యవహారంపై దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా స్పందిస్తూ.. సత్యేంద్ర జైన్‌పై ఎనిమిదేళ్లుగా తప్పుడు కేసు నడుస్తోందన్నారు. ఇప్పటి వరకు ఈడీ ఆయన్ను చాలా సార్లు పిలిచిందని.. ఏం లభించకపోవడంతో కొన్నాళ్లకు పిలవడమే మానేసిందని తెలిపారు. ప్రస్తుతం ఆయన హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఇన్‌ఛార్జిగా ఉన్న నేపథ్యంలో.. మళ్లీ మొదలుపెట్టినట్లు ఆరోపించారు. హిమాచల్‌లో భాజపా ఘోరంగా ఓడిపోనుందని.. అందుకే సత్యేందర్‌ను అరెస్టు చేయించినట్లు ట్వీట్ చేశారు.