తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అవినీతి కేసులో మాజీ హోంమంత్రి సహాయకుల అరెస్ట్! - మహారాష్ట్ర తాజా వార్తలు

మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్​ముఖ్​పై ఉచ్చు బిగుస్తోంది. రూ.100 కోట్ల వసూళ్ల ఆరోపణలకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో దేశ్​ముఖ్​కి చెందిన ఇద్దరు సహాయకులను మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. అంతేగాక ఈడీ ముందుకు వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందిగా దేశ్​ముఖ్​కు సమన్లు జారీచేసింది.

ED raids Anil Deshmukh's residence
మాజీ హోంమంత్రి వ్యక్తిగత సహాయకుల అరెస్ట్

By

Published : Jun 26, 2021, 8:39 AM IST

Updated : Jun 26, 2021, 10:26 AM IST

రూ.100 కోట్ల వసూళ్ల ఆరోపణలకు సంబంధించి మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్​ముఖ్​కి చెందిన ఇద్దరు సహాయకులను మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. ముంబయి, నాగ్‌పూర్‌లలోని దేశ్​ముఖ్​ నివాసాల్లో ఏకకాలంలో దాడులు చేసిన ఈడీ.. దేశ్‌ముఖ్ వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ పలాండే, పర్సనల్ అసిస్టెంట్ కుందన్ శిండేలను సుమారు తొమ్మిది గంటలపాటు ప్రశ్నించిన తరువాత అరెస్టు చేసినట్లు ప్రకటించింది. మంత్రిగా ఉన్న సమయంలో దేశ్​ముఖ్​కు రూ.4 కోట్లు ఇచ్చినట్లు కొందరు బార్ యజమానులు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వాంగ్మూలాలను నమోదు చేసిన ఈడీ.. ఇద్దరినీ అదుపులోకి తీసుకుంది. అలాగే తమముందు వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందిగా దేశ్​ముఖ్​కు సమన్లు జారీచేసింది.

వీరిని ముంబయిలోని ప్రత్యేక పీఎంఎల్‌ఐ కోర్టులో శనివారం హాజరుపరచనుంది. ఈ కేసులో సీబీఐ ప్రాథమిక విచారణ అనంతరం దేశ్​ముఖ్ సహా ఇతరులపై.. బొంబాయి హైకోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేయనున్నట్లు తెలిపింది.

సోదాలు..

దేశ్​ముఖ్ నివాసాలు, కార్యాలయాలపై ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శుక్రవారం దాడులు నిర్వహించింది. ఇందులో ముంబయిలోని ఇంటితో పాటు.. నాగ్​పూర్​లోని దేశ్​ముఖ్ నివాసం కూడా ఉంది. బార్ యజమానుల నుంచి నెలకు రూ.100కోట్లు వసూలు చేయాలని దేశ్​ముఖ్ పోలీసులకు లక్ష్యంగా పెట్టారని ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరమ్​బీర్ సింగ్ ఏప్రిల్​లో ఆరోపణలు చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ సైతం రాశారు. ఈ పరిమాణాల నేపథ్యంలో దేశ్​ముఖ్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

పరమ్​బీర్ ఆరోపణలపై దర్యాప్తు చేయాలని ఇటీవల బాంబే హైకోర్టు.. సీబీఐని ఆదేశించింది. దీంతో మాజీ మంత్రిపై సీబీఐ ఎఫ్​ఐఆర్​ దాఖలు చేసింది. దీని ఆధారంగా ఈడీ.. దేశ్​ముఖ్​పై అక్రమ నగదు చలామణి చట్టం(పీఎంఎల్ఏ) కింద క్రిమినల్ కేసు నమోదు చేసి తాజా సోదాలు నిర్వహించింది.

'అసహనంతోనే వేధింపులు..'

తమ పార్టీ సీనియర్ నేత అనిల్ దేశ్​ముఖ్​ను కావాలనే విచారణ సంస్థలు వేధింపులకు గురిచేస్తున్నాయని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

"దేశ్​ముఖ్ కొడుకు వ్యాపారాలపై ఆరా తీశారు. ఏమీ దొరకలేదు. ఆ అసహనంతో అనిల్​ను వేధిస్తున్నారు. ఇవి మా పార్టీకి కొత్త కాదు. వాటి గురించి ఆందోళన చెందం."

-శరద్ పవార్

మరోవైపు విచారణాధికారులకు పూర్తిగా సహకరిస్తానని దేశ్​ముఖ్ తెలిపారు. ఈడీ దాడులు రాజకీయ ప్రేరేమితమని, పార్టీ హస్తం ఉందన్న ఆరోపణలను భాజపా ఖండించింది.

ఇవీ చదవండి:

Last Updated : Jun 26, 2021, 10:26 AM IST

ABOUT THE AUTHOR

...view details