నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ దిల్లీలో వరుసగా రెండో రోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. మంగళవారం 11 గంటలకు పైగా ఆయనపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. నగదు అక్రమ చలామణి అభియోగాలకు సంబంధించి సమాధానాలు రాబట్టి, వాంగ్మూలం నమోదు చేసింది. బుధవారమూ విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు సమన్లు జారీచేసింది. మరోవైపు- రాహుల్ విచారణకు హాజరైన నేపథ్యంలో హస్తినలో మంగళవారమూ కాంగ్రెస్ పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తూ ఆందోళనలు చేపట్టినందుకుగాను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ సహా పలువురు నేతలు, వందలమంది కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రాత్రి 11:30 గంటల దాకా.. రాహుల్‌గాంధీ తన సోదరి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా తోడు రాగా మంగళవారం ఉదయం 11:05 గంటలకు మధ్య దిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. 11:30 నుంచి అధికారులు ఆయన్ను ప్రశ్నించడం ప్రారంభించారు. మధ్యాహ్నం 3:30 గంటలకు భోజన విరామం కోసం రాహుల్ తన నివాసానికి వెళ్లారు. 4:30 గంటలకు తిరిగి ఈడీ కార్యాలయానికి వచ్చారు. అనంతరం దాదాపు రాత్రి 11:30 గంటల వరకు విచారణ కొనసాగింది.
ఈడీ అధికారులకు రాహుల్ క్షమాపణలు!: ఈడీ విచారణ సందర్భంగా రాహుల్‌గాంధీ అధికారులకు సోమవారం క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది. ఈడీ వర్గాల సమాచారం ప్రకారం.. వాస్తవానికి సోమవారం రాత్రి 8:30 గంటలకే రాహుల్ తొలిరోజు విచారణ ముగిసింది. నగదు అక్రమ చలామణీ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) కింద అప్పటికే ఆయన లిఖితపూర్వకంగా తన వాంగ్మూలాన్ని నమోదుచేశారు. అయితే అందులో తప్పులు దొర్లాయి. దీంతో అధికారులకు ఆయన క్షమాపణలు చెప్పారు.