ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఈసీ పనితీరు, నిర్వహణ లోపాలు మొదలైన విషయాలపై సమీక్షించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. కమిటీ చేసే సూచనల ప్రకారం సంస్కరణలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. ఎన్నికల వేళ కొవిడ్ నిబంధనల అమలు నుంచి రాజకీయ పార్టీల ఖర్చును పరిమితం చేయడం వరకు ఈసీ ఎలాంటి చర్యలు చేపట్టిందో ఈ కమిటీ సమీక్షించనుంది.
ఎన్నికల అనంతరం ఎలక్టొరల్ మెషినరీ భద్రత, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఖర్చులపై నియంత్రణ సహా ఎలక్టొరల్ మెషినరీకి సంబంధించి రాష్ట్ర స్థాయిలో ఉన్న సీఈఓ, డీఈఓ, ఆర్ఓ కార్యాలయాల భద్రత పటిష్ఠం చేయడం వంటి అంశాలను కమిటీ ప్రధానంగా సమీక్షించనుంది. వీటితో పాటు ఎలక్టొరల్ రోల్, ఓటర్ లిస్ట్, గుర్తింపు కార్డు అందజేత విషయాల్లో ఉన్న సమస్యలపై కమిటీ దృష్టి సారించనుంది.