EC Orders to DK Aruna Elected From Gadwal Constituency :గద్వాల నియోజకవర్గం నుంచిడీకే అరుణ ఎన్నికైనట్లుగా ప్రచురించాలని.. రాష్ట్ర ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశం చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం.. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాసింది. హైకోర్టు ఉత్తర్వులను తదుపరి గెజిట్‌లో ప్రచురించాలని ఈసీ ఆదేశించింది. సీఈఓ రాసిన లేఖతో హైకోర్టు తీరు కాపీని ఈసీ జతపరిచింది. ఇందుకుగాను సీఈఓకు.. ఈసీ అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్ లేఖ రాశారు.
ఈ మేరకు హైకోర్టు ఆదేశాలను అనుసరించి డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ విడుదల చేసింది. వెంటనే గెజిట్‌ను పబ్లిష్ చేయాల్సిందిగా.. అసెంబ్లీ కార్యదర్శికి, ప్రభుత్వ కార్యదర్శికి, తెలంగాణ చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ వికాస్‌రాజ్‌కు కేంద్ర ఎన్నికల కమిషన్ లేఖ రాసింది. గెజిట్ పబ్లిష్ చేసిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాలని ఆదేశించింది. జోగులాంబ గద్వాల జిల్లాలోని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ఎన్నికల చీఫ్ ఎలక్ట్రోరల్ ఆదేశాలను అమలు చేస్తూ తనను గద్వాల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్, కార్యదర్శి అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ ఆదేశాలను వెంటనే అమలు చేయాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. అలాగే త్వరలో తాను అసెంబ్లీ సెక్రెటరీని కలవబోతున్నట్లు వెల్లడించారు.
Gadwal MLA Election Controversy :గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌రెడ్డి(Gadwal MLA Krishnamohan Reddy) ఎన్నికను రద్దు చేస్తూ హైకోర్టు(Telangana High Court) తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే రెండో స్థానంలో ఉన్న అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి డీకే అరుణ(DK Aruna)ను ఎమ్మెల్యేగా హైకోర్టు ప్రకటించింది. తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారంటూ ఎమ్మెల్యే కృష్ణ మోహన్‌రెడ్డి అంశంలో ఈ తీర్పును వెలువరించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం ఉల్లంఘించినందున.. రూ.2 లక్షల 50 వేలు జరిమానా చెల్లించడంతో పాటు.. పిటిషనర్ డీకే అరుణకు రూ.50 వేలు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది.