పోలింగ్ సమయంలో తమ పార్టీ నేతలను అరెస్టు చేయాలని పోలీసులకు ఎన్నికల సంఘానికి చెందిన ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు ఆదేశాలిస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ కుట్ర కోణంపై ఎన్నికలు ముగిసిన తర్వాత తాను సుప్రీం కోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు. బీర్భూమ్ జిల్లా బోలాపుర్లోని గీతాంజలి ఆడిటోరియమ్‌లో తమ పార్టీ కార్యకర్తలతో ఆమె సమావేశమయ్యారు. తనపై షోకాజ్ నోటీసులు జారీ చేసినా కూడా తాను ఈ విషయంలో మౌనంగా ఉండబోనని పేర్కొన్నారు.
"ఇక భరించింది సరపోయింది. స్వేచ్ఛాయుత, నిజాయితీ ఎన్నికల కోసం వారు(ఎన్నికల పరిశీలకులు) పనిచేస్తే నాకు ఏ ఇబ్బంది లేదు. కానీ, వాళ్లు భాజపాకు సాయం చేసేందుకు మాత్రమే పని చేస్తున్నారు. టీఎంసీని నాశనం చేయాలని అనుకుంటున్నారు. ఈ అధికారులు పోలింగ్‌కు ముందురోజు రాత్రి మా కార్యకర్తలను అరెస్టు చేసి.. సాయంత్రం 4 గంటల వరకు కస్టడీలో ఉంచాలని ఆదేశాలిస్తున్నారు. ఈ వాట్సాప్ సంభాషణలను భాజపాలోని నాయుకులు నాకు ఇచ్చారు."
-మమతా బెనర్జీ, టీఎంసీ అధినేత్రి