Gujarat Election 2022 : హిమాచల్ ప్రదేశ్‌తోపాటు గుజరాత్ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ విడుదల చేయకపోవడంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. సాధారణంగా రాష్ట్రాల అసెంబ్లీల పదవీ కాలాలు 6నెలల వ్యవధిలో ముగుస్తుంటే.. ఒకేసారి షెడ్యూల్ ప్రకటించి లెక్కింపు కూడా ఒకే రోజు చేపడతారు. హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది జనవరి 8తో ముగుస్తుండగా.. గుజరాత్ శాసనసభ పదవీకాలం ఫిబ్రవరి 18తో పూర్తికానుంది. దీంతో ఈ రెండు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారని అంతా భావించినా.. హిమాచల్‌కు మాత్రమే తేదీలను ఈసీ ప్రకటించింది. దీనిపై స్పందించిన కాంగ్రెస్.. గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయకపోవడంపై తమ పార్టీ ఏమీ ఆశ్చర్యపోవడం లేదని తెలిపింది. గుజరాత్‌లో మరిన్ని హామీలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసేందుకు ప్రధాని మోదీకి మరింత సమయం దొరికిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఎద్దేవా చేశారు.
'ప్రధానికి మరింత సమయం దొరికింది'.. గుజరాత్ ఎన్నికలపై ప్రతిపక్షాల తీవ్ర విమర్శలు - ec not announced gujarath election dates
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన ఈసీ గుజరాత్ షెడ్యూల్ విడుదల చేయకపోవడంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. గుజరాత్‌కు హామీలు ఇచ్చేందుకు ప్రధానికి మరింత సమయం దొరికిందని ఎద్దేవా చేసింది. అయితే గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయని అంశంలో ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదని కేంద్ర ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది.
అయితే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ అంశంలో ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. వాతావరణంతో పాటు అనేక కారణాల వల్ల హిమాచల్ ఎన్నికల తేదీలను ముందుగా ప్రకటించామని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ తెలిపారు. 2017లోనూ ఇలాగే చేశామని.. ఆ ఏడాది అక్టోబరు 13న హిమాచల్‌కు, అక్టోబరు 25న గుజరాత్‌కు షెడ్యూల్ ప్రకటించినట్లు స్పష్టం చేశారు. అయితే 2 రాష్ట్రాల ఫలితాలను మాత్రం ఒకేసారి వెల్లడించినట్లు తెలిపారు. ప్రస్తుతం 2 రాష్ట్రాల అసెంబ్లీల గడువుల మధ్య 40 రోజుల వ్యవధి ఉందని.. ఒక రాష్ట్ర ఎన్నికల ఫలితాలు మరో రాష్ట్రంపై పడకుండా ఉండాలంటే కనీసం 30 రోజుల వ్యవధి ఉంటే చాలని రాజీవ్ కుమార్ వివరించారు.
హిమాచల్ ప్రదేశ్‌కు నవంబరు 12న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబరు 8న ఫలితాలను ప్రకటించనున్నట్లు ఈసీ వెల్లడించింది. పోలింగ్ తేదీ, కౌంటింగ్‌కు మధ్య నెల రోజులకు పైగా వ్యవధి ఉండటంతో ఈ మధ్యలోనే గుజరాత్ ఎన్నికలను కూడా నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ నెలలోనే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది.