తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ తొలగింపు ఆషామాషీ కాదు' - జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్

రాజ్యాంగం పరంగా చూస్తే ఒక రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ను అంత సులువుగా ‌తొలగించలేరని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఆ పదవిలో ఉన్న వ్యక్తిని తప్పించాలంటే.. హైకోర్టు జడ్జి తొలగింపునకు సమానమైన నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. ఆర్టికల్‌ 243కే(2) అధికరణకు విస్తృతార్థం ఇచ్చిన ఉన్నత న్యాయస్థానం.. 'గోవా ఈసీ కేసులో ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది.

EC must be independent, govt official taking charge is mockery of democracy: Supreme Court
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ తొలగింపు ఆషామాషీ కాదు

By

Published : Mar 14, 2021, 7:51 AM IST

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను తొలగించడమంటే ఆషామాషీ కాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తిని తొలగించడానికి ఎలాంటి నిబంధనలు పాటిస్తారో.. కమిషనర్‌ విషయంలోనూ అవే నిబంధనలు పాటించాలని పేర్కొంది. ఆర్టికల్‌ 243కే(2)ను ప్రస్తావిస్తూ.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు రాజ్యాంగం ఎంతో స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించిందని తెలిపింది. గోవాలో ఆ రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించడాన్ని సవాల్‌చేస్తూ దాఖలైన కేసులో న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌ నారిమన్‌, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఇచ్చిన తీర్పు పూర్తి ప్రతి శనివారం సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశారు.

అపహాస్యం చేయడమే..

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ల నియామకంలో అనుసరించాల్సిన పద్ధతులపై ఈ తీర్పులో జస్టిస్‌ నారిమన్‌ కీలక సూచనలు చేశారు. 'రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243కే అప్పగించిన బాధ్యతలను విస్మరించడం (న్యాయశాఖ కార్యదర్శికి ఎన్నికల కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించడం) అత్యంత ఆవేదన కల్గిస్తోందని ధర్మాసనం తెలిపింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఉండే వ్యక్తి రాష్ట్రంలో మున్సిపాలిటీలు, పంచాయతీల్లాంటి ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తూ అత్యంత ముఖ్యమైన రాజ్యాంగ బాధ్యతలు నిర్వర్తిస్తారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి అతీతంగా, స్వతంత్రంగా ఉండాలని పేర్కొంది. ఆ బాధ్యతలు నిర్వర్తించే వారిని పదవి నుంచి తొలగించడానికి అనుసరించాల్సిన విధానం గురించి ఆర్టికల్‌ 243కే(2)కింద పొందుపరిచిన నిబంధనలను బట్టి చూస్తే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ స్వతంత్రతకు ఎంత ప్రాధాన్యం ఇచ్చారన్నది స్పష్టమవుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను తొలగించేటప్పుడు హైకోర్టు న్యాయమూర్తితో సమానమైన నిబంధనలను అనుసరించాలి. అలాంటి ముఖ్యమైన, స్వతంత్ర రాజ్యాంగబద్ధమైన పదవిలో రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే అధికారిని నియమించడం అన్నది మా దృష్టిలో రాజ్యాంగం అప్పగించిన బాధ్యతలను అపహాస్యం చేయడమే. న్యాయశాఖ కార్యదర్శికి ఎన్నికల కమిషర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించడం ద్వారా ఆర్టికల్‌ 243కె కింద రాజ్యాంగం అప్పగించిన బాధ్యతలను గోవా ప్రభుత్వం విస్మరించింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా స్వతంత్ర వ్యక్తితో ఆ పదవిని భర్తీచేయాలి. ఇకమీదట, ఆర్టికల్‌ 243కె కింద ఏ రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్‌ను నియమించినా వారు పూర్తి స్వతంత్ర వ్యక్తులై ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ఈసీ స్వతంత్రంగా..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ పదవుల్లో ఉన్నవారికి ఆ బాధ్యతలు అప్పగించకూడదని.. ఒకవేళ ఏ రాష్ట్రంలోనైనా అలాంటి వ్యక్తులు ఈ పదవిలో ఉంటే తక్షణం దిగిపొమ్మని కోరాలి అని ధర్మాసనం తెలిపింది. ''ఉన్నత రాజ్యాంగ పదవిలో ఆర్టికల్‌ 243కే ప్రకారం కేవలం స్వతంత్ర వ్యక్తులనుమాత్రమే నియమించాలి. రాజ్యాంగంలోని పార్ట్‌-9, 9ఎల కింద ఎన్నికలు నిర్వహించే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ స్వతంత్రంగా ఉండాలన్న రాజ్యాంగధర్మాన్ని ఆచరణలోపెట్టడానికి వీలుగా ఆర్టికల్‌ 142 ప్రకారం మేం ఈ ఆదేశాలు జారీచేస్తున్నాం. భవిష్యత్తులో ఈ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలి'' అని నారిమన్‌ ఈ తీర్పులో పేర్కొన్నారు.

ఇవీ చదవండి:రిజర్వేషన్ల నిగ్గుతేల్చనున్న సుప్రీంకోర్టు

'అత్యాచార బాధితులకు హక్కుల గురించి చెప్పాల్సిందే'

'రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా వారు ఉండకూడదు'

ABOUT THE AUTHOR

...view details