ఇటీవల దాఖలు చేసిన వ్యాజ్యాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ)లో అంతర్గతంగా అభిప్రాయబేధాలు కనిపిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ సమయంలో ఈసీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుప్రీంకోర్టులో ఈసీ తరఫున వాదించే న్యాయవాదుల్లో ఒకరైన మోహిత్ డీ రామ్ రాజీనామా చేశారు. ఈసీ ప్రస్తుత పనితీరుకు తన విలువలు అనుగుణంగా లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజీనామా లేఖలో మోహిత్ వెల్లడించారు.
"ఎన్నికల సంఘం స్టాండింగ్ కౌన్సిల్ నుంచి మొదలైన నా ప్రస్థానం ఈసీ ప్యానెల్ కౌన్సిల్‌లో ఒకరిగా చేరడం అత్యంత ప్రతిష్టాత్మక మైలురాయిగా భావిస్తున్నాను. అయినప్పటికీ నా విలువలు ఎన్నికల సంఘం ప్రస్తుత పనితీరుకు అనుగుణంగా లేవని గుర్తించాను. అందుచేత ఈసీ ప్యానెల్ నుంచి తప్పుకుంటున్నాను"
- మోహిత్ డీ రామ్, న్యాయవాది
2013 నుంచి సుప్రీంకోర్టులో ఆయన ఈసీ తరపున మోహిత్ డీ రామ్ వాదిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. కొవిడ్-19 కేసుల పెరుగుదలకు ఎన్నికల సంఘానిదే బాధ్యత అని, వారిపై హత్యానేరం కింద విచారణ చేపట్టవచ్చని మద్రాస్ హైకోర్టు ఇటీవల చేసిన మౌఖిక వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం వేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. కోర్టుల్లో జరిగే విచారణను నివేదించకుడా మీడియాను నిలువరించలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అయితే, ఈ అంశాలపై మద్రాస్ హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో ఎన్నికల సంఘం ఇటీవల దాఖలు చేసిన వ్యాజ్యాలకు సంబంధించి అంతర్గతంగా బేధాభిప్రాయాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో ఈసీ న్యాయవాది మోహిత్ రాజీనామా చేయడం అందుకు బలాన్ని చేకూరుస్తోంది.
ఇదీ చూడండి:యూకేకు పంపాల్సిన 50 లక్షల టీకాలు భారత్‌కే!