EC Issues Notices to Priyanka Gandhi : ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత పోస్టులు, వ్యాఖ్యలు చేశారని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి కేంద్ర ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ, అదానీ ఫొటోలను షేర్ చేస్తూ.. ప్రధాని పారిశ్రామికవేత్తల కోసమే తప్ప ప్రజల కోసం పనిచేయడంలేదన్నట్లు ఆమ్ ఆద్మీ ట్విట్టర్లో పోస్ట్ చేసిందని నవంబర్ 10న బీజేపీ నేతలు ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్‌కు నోటీసులు ఇచ్చిన ఈసీ... ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడంపై నవంబర్ 16లోపు సమాధానం ఇవ్వాలని పేర్కొంది. నిర్ణీత సమయంలో సమాధానం ఇవ్వకుంటే.. తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇలాంటి విషయాన్ని ప్రచారం చేసేముందు ఒక జాతీయ పార్టీగా వాస్తవాలు సరిచూసుకోవాల్సిందని హితవు పలికింది.
'వివరణ ఇవ్వకుంటే చర్యలు తప్పవు'.. ప్రియాంక గాంధీకి ఈసీ నోటీసు
ప్రధాని మోదీపై నిరాధార ఆరోపణలు చేశారంటూ బీజేపీ చేసిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న ఈసీ... ప్రియాంక గాంధీకి కూడా షోకాజ్ నోటీసులు జారీ చేసింది. గత వారం మధ్యప్రదేశ్ భోపాల్‌లో పర్యటించిన ప్రియాంక... ప్రభుత్వ సంస్థలను మోదీ ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారని ఆరోపించారు. ఒక సీనియర్ నేత, అందులోనూ ఓ జాతీయ పార్టీకి ప్రచార తారగా ఉన్న వ్యక్తి చేసే ప్రకటనల్ని ప్రజలు నిజమేనని అనుకుంటారని.. అలాంటివారు చేసే ప్రసంగాలు వాస్తవాలపై ఆధారపడి ఉండాలని తెలిపారు. ఓటర్లను తప్పుదారి పట్టించేందుకు అవకాశం ఇవ్వకూడదని స్పష్టంచేశారు. ఇతర పార్టీలపై విమర్శలు చేసినప్పుడు ఆ పార్టీ విధానాలు, గతంలో చేసిన అభివృద్ధి వరకు మాత్రమే పరిమితమవ్వాలిగానీ వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండాలని ఎన్నికల సంఘం పేర్కొంది. గురువారం రాత్రి 8 గంటల లోపు.. సరైన వివరణ ఇవ్వకుంటే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ప్రియాంకను ఈసీ హెచ్చరించింది. ప్రస్తుత ఎన్నికల్లో ప్రియాంక గాంధీకి ఈసీ పంపిన రెండో నోటీసు ఇది.