Assembly elections EC new rules: కరోనా ఉద్దృతి కొనసాగుతున్న క్రమంలో.. ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం కాస్త ఊరటనిచ్చింది. బహిరంగ సభలు, ఇండోర్ సమావేశాలు, ఇంటింటి ప్రచారాలను నిర్వహించుకోవచ్చని తెలిపింది. గతంలో విధించిన నిషేధం రోడ్ షోలు, పాదయాత్రలు, సైకిల్, బైక్, వాహనాల ర్యాలీలు, ఊరేగింపులకు వర్తిస్తుందని పేర్కొంది.
"ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇండోర్ సమావేశాలు నిర్వహించాలంటే.. ఆ హాలు సామర్థ్యంలో 50 శాతం మంది మాత్రమే హాజరుకావాల్సి ఉంటుంది. ఓపెన్ గ్రౌండ్లో అయితే 30 శాతం మందితో మాత్రమే సమావేశం నిర్వహించాలి. బహిరంగ సభల్లో కచ్చితంగా భౌతిక దూరం పాటించాలి."
- కేంద్ర ఎన్నికల సంఘం
గతంలో మాదిరిగానే... పాదయాత్రలు, సైకిల్, బైక్, వాహనాల ర్యాలీలపై నిషేధం ఉంటుందని ఎన్నికల సంఘం తెలిపింది. అలానే ఇంటింటి ప్రచారానికి 20 మందిని మాత్రమే అనుమతిస్తున్నట్లు పేర్కొంది. ఎన్నికల ప్రచారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల లోపు మాత్రమే చేయాలని సూచించింది.