East Godavari Dalit youth Mahendra Suicide: "నా చావుకు కొవ్వూరు ఎస్సై భూషణం, వైసీపీ నేతలు ముదునూరి నాగరాజు, బల్లుల సతీష్ కారణం. వారిని చట్టపరంగా శిక్షించాలి. ఇదే నా మరణ వాంగ్మూలం. చేనులో పనిచేసుకుంటున్న నన్ను సీఐ రమ్మంటున్నారంటూ స్టేషన్‌కు తీసుకెళ్లారు. సాయంత్రం వరకూ అక్కడ ఉంచేశారు. అసలు ఎందుకు స్టేషన్‌కు తీసుకెళ్లారో చెప్పలేదు. నన్ను చూసి ఎందుకొచ్చావని సీఐ ప్రశ్నించారు. చివరికి మా బంధువులు వచ్చాక విడిచిపెట్టారు. “ మరణానికి ముందు దళిత యువకుడు బొంత మహేంద్ర ఇచ్చిన వాంగ్మూలం ఇది.
వైసీపీలో ఆధిపత్య పోరు మహేంద్ర బలవన్మరణానికి కారణమైంది. దొమ్మేరు (Dommeru)లో ఈ నెల 6న జరిగిన ‘గడపగడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమానికి హోం మంత్రి వస్తున్నారంటూ వైసీపీ నాయకులు నాగరాజు, సతీష్ ఫ్లెక్సీలు పెట్టారు. వారి ముఖాలున్న భాగాన్ని ఎవరో కత్తిరించటంతో.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మహేంద్రను ఎస్సై పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి నిర్బంధించారు. అందుకే అతను ప్రాణాలు తీసుకున్నాడని బాధితుడి కుటుంబసభ్యులు వాపోతున్నారు. ఈరోజు మహేంద్ర పుట్టినరోజని.. వాడే లేకుండా పోయాడంటూ కుటుంబసభ్యులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.
దొమ్మేరులో హోంమంత్రిని అడ్డుకున్న స్థానికులు - ఉద్రిక్తత
మృతుడు మహేంద్ర కుటుంబసభ్యుల్ని పరామర్శించి, పరిహారం అందించేందుకు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున, గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుతో పాటు హోం మంత్రి తానేటి వనిత (Home Minister Taneti Vanitha)గురువారం దొమ్మేరుకు వెళ్లారు. నాగార్జున, వెంకట్రావులను బాధితుడి ఇంటి వద్దకు వెళ్లేందుకు అంగీకరించిన దొమ్మేరు ఎస్సీ పేట యువత, మహిళలు.. వనిత వాహనాన్ని అడ్డుకున్నారు.