Tree ambulance service: చెట్ల సంరక్షణ కోసం తూర్పు దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ఎండిపోతున్న చెట్లను కాపాడుకునేందుకు అంబులెన్సు సర్వీసులను ప్రారంభించింది. దిల్లీ హైకోర్టు ఆదేశాల ప్రకారం ఉచిత అంబులెన్సు సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు తూర్పు దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యానవన శాఖ డైరెక్టర్ రాఘవేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఎండిపోతున్న చెట్ల గురించి సమాచారం తెలుసుకొని, వాటిని కాపాడేందుకు సంరక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంబులెన్సులు చెట్ల దగ్గరికి వెళ్లి.. వాటిని పరీక్షిస్తాయని, చెట్లకు ఏవైనా వ్యాధులు వస్తే సరైన చికిత్స అందించి వాటిని బతికిస్తాయని వివరించారు.
అంబులెన్సులో పనిచేసే సిబ్బంది కోసం ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. చెట్లకు ఎలా చికిత్స ఇవ్వాలో నేర్పించాం. వ్యాధి బారిన పడ్డ చెట్లను నీటితో శుభ్రం చేసి.. మృత కణాలను తొలగిస్తాం. ఆ తర్వాత ఔషధాలు, ఎరువులు అందించి చెట్లను స్టెరిలైజ్ చేస్తాం. థర్మాకోల్‌తో నింపిన ఇనుప కంచెను చెట్లు దెబ్బతిన్న చోట అమరుస్తాం. దానిపై పీఓపీ కోటింగ్ వేసి.. గాలి చొరబడకుండా చేస్తాం. తద్వారా లోపల చెట్ల కణాలు పెరుగుతాయి. వాటి కాండాలు బలంగా తయారవుతాయి. తూర్పు దిల్లీ కార్పొరేషన్ పరిధిలోని గార్డెనర్లకు సైతం ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం.
-రాఘవేంద్ర సింగ్, తూర్పు దిల్లీ మున్సిపల్ అధికారి