సాధారణంగా ఎక్కడైనా భూకంపం వస్తే ఊళ్లకు ఊళ్లు ప్రభావితం అవుతాయి. ఏదైనా పెద్ద నగరంలో భూకంపం వస్తే.. ఆ నగరంలోని కొంత భాగమైనా కంపిస్తుంది. అయితే తమిళనాడు చెన్నైలో జరిగిన ఘటన స్థానికుల్లో అనుమానాలకు కారణమైంది. రెండంటే.. రెండే భవనాల్లో ప్రకంపనలు వచ్చాయి. చెన్నై మౌంట్ రోడ్‌లోని అన్నా సలాయ్ ప్రాంతంలో ఉన్న రెండు భవనాలు కంపనానికి గురయ్యాయి. చుట్టు పక్కల ఉన్న ఇతరులు ఎవరికీ ఈ ప్రకంపనాల గురించి తెలియలేదు. కేవలం రెండు భవనాల్లోనే ప్రకంపనలు వచ్చేసరికి స్థానికుల్లో ఆందోళన ఏర్పడింది.
మౌంట్‌రోడ్‌లో ఉన్న రెండు భారీ బహుళ అంతస్తుల భవనాల్లో స్వల్ప ప్రకంపనలు వచ్చాయి. దీంతో అందులో ఉండే వారంతా బయటకు పరుగులు పెట్టారు. భూకంపం అనుకొని ఆందోళన చెందారు. అయితే, సమీపంలోని వారంతా ఎలాంటి భయం లేకుండా తమ పనుల్లో ఉండిపోయారు. భవనంలో ప్రకంపనలు వచ్చాయని తెలియగానే ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది. నిజంగా అది భూకంపమా కాదా అనే ప్రశ్నలు, అనుమానాలు మొదలయ్యాయి. ఈ ప్రాంతానికి కొద్ది దూరంలో జరుగుతున్న మెట్రో పనుల వల్ల ప్రకంపనలు వచ్చి ఉంటాయని కొందరు అనుమానించారు. దీంతో మెట్రో ప్రాజెక్ట్ జనరల్ మేనేజర్‌ను ఈటీవీ భారత్ సంప్రదించింది. అయితే, అన్నా సలాయ్ ప్రాంతానికి సమీపంలో మెట్రో నిర్మాణ పనులేవీ చేపట్టడం లేదని ఆయన స్పష్టత ఇచ్చారు. అయితే, అన్నా సలాయ్ ప్రాంతానికి సమీపంలో ఓ భవన కూల్చివేత ప్రక్రియ కొనసాగుతోందని, అందువల్లే ప్రకంపనలు వచ్చి ఉంటాయని అధికారులు వెల్లడించారు.