Earthquake In Kutch Today : గుజరాత్‌ను ఓ వైపు బిపోర్జాయ్ తుపాన్ వణికిస్తుండగా.. మరో వైపు భూమి కంపించడం అక్కడి ప్రజల్ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. కచ్ జిల్లాలో బుధవారం సాయంత్రం 3.5 తీవ్రతతో భూమి కంపించిది. జిల్లాలోని భచౌకు 5 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించినట్లు గాంధీనగర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిస్మోలాజికల్ రీసెర్చ్ పేర్కొంది. అయితే ఈ భూప్రకంపనల వల్ల ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
Biporjoy Cyclone News : మరోవైపు.. అతి తీవ్ర తుపాన్‌బిపోర్‌జాయ్ భారీ విధ్వంసం సృష్టించనుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో గుజరాత్ సహా పలు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాణ, ఆస్తి నష్టం చాలా వరకు తగ్గించేందుకుగానూ ముందస్తు చర్యలు చేపట్టాయి. ఇప్పటికే సౌరాష్ట్ర-కచ్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 54 తాలుకాల పరిధిలో 10 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు.. గుజరాత్ అత్యవసర కార్యకలాపాల కేంద్రం ప్రకటించింది. దేవభూమి ద్వారక, రాజ్‌కోట్, జామ్‌నగర్, పోరుబందర్, జునాగఢ్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నట్లు అధికారులు తెలిపారు.
దేవభూమి ద్వారక జిల్లా పరిధిలోని ఖంభాలియా తాలుకాలో అత్యధికంగా 121 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు చెప్పారు. ద్వారకలో 92 మిల్లీమీటర్లు, కల్యాణ్‌పుర్‌లో 72 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. తుపాన్ గుజరాత్ తీరానికి సమీపించేకొద్దీ వర్ష తీవ్రత పెరుగుతుందని అధికారులు హెచ్చరించారు. కచ్, దేవభూమి ద్వారక, జామ్‌నగర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
సౌరాష్ట్ర, కచ్‌కు పక్కనే ఉన్న మాండ్వి, పాకిస్థాన్‌లోని కరాచీల మధ‌్య జఖౌ ఓడరేవు సమీపంలో గురువారం సాయంత్రం అతి తీవ్ర తుపాన్‌గాబిపోర్‌జాయ్ తీరం దాటనున్నట్లు అధికారులు చెప్పారు. ఈ సమయంలో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. తుపాను ప్రస్తుతం కచ్‌కు 290 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు చెప్పారు. పోరుబందర్, రాజ్‌కోట్, మోర్బీ, జునాగఢ్, సౌరాష్ట్ర, ఉత్తర గుజరాత్ ప్రాంతాల్లో గురువారం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. శుక్రవారం ఉత్తర గుజరాత్ జిల్లాలతోపాటు దక్షిణ రాజస్థాన్‌లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు.