Earthquake in Karnataka: కర్ణాటకలోని చిక్కబళ్లాపుర జిల్లాలో వరుసగా రెండోరోజు భూకంపం సంభవించింది. బెంగళూరుకు 60 కిలోమీటర్ల దూరంలోని ఈ ప్రాంతంలో రిక్టార్ స్కేల్‌పై 3.6 తీవ్రత నమోదైనట్లు కేఎస్‌ఎన్‌డీఎంసీ అధికారులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం 2.16 గంటల ప్రాంతంలో భూ ప్రకంపనలు వచ్చాయని వెల్లడించారు.
జిల్లాలోని సదెనహళ్లి, బీరగనహళ్లి, సెట్టిగేర్ గ్రామాలకు 1.2 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రీకృతమై ఉన్నట్లు అధికారులు తెలిపారు. సుమారు 20-30 కిలోమీటర్ల పరిధిలో భూమి కంపించినట్లు చెప్పారు. ఇలాంటి భూకంపాలతో ఎలాంటి ప్రమాదం లేదని, స్వల్ప ప్రకంపనలు సంభవించిన క్రమంలో ప్రజలు భయాందోళనలకు గురికావొద్దని సూచించారు.
తమిళనాడులో భూకంపం..
తమిళనాడు వెల్లూరుకు పశ్చిమ వాయవ్యంలో 50 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 3.14 గంటల ప్రాంతంలో భూమి కంపించిందని, రిక్టార్ స్కేల్‌పై 3.5 తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగలేదని పేర్కొంది.
బుధవారం రెండు సార్లు..
కర్ణాటకలోని బెంగళూరు ఉత్తర ఈశాన్య ప్రాంతంలో బుధవారం ఉదయం భూకంపం సంభవించింది. చిక్కబళ్లాపుర జిల్లాలోని ప్రాంతాల్లో రిక్టార్ స్కేల్‌పై 2.9, 3.0 తీవ్రతతో రెండుసార్లు భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. భూ ప్రకంపనలతో ఆందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు పెట్టారు.
చిక్కబళ్లాపుర జిల్లాలోని మండికల్ గ్రామపంచాయతీ పరిధిలో ఉదయం 10.05 గంటలకు భూమి కంపించినట్లు కర్ణాటక రాష్ట్ర ప్రకృతి విపత్తుల పర్యవేక్షణ కేంద్రం అధికారులు తెలిపారు. గ్రామానికి 1.4 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు చెప్పారు. రికార్ట్ స్కేల్‌పై 2.9 తీవ్రత నమోదైనట్లు తెలిపారు.
చిక్కబళ్లాపుర తాలుకా, అడ్డగళ్లు గ్రామ పంచాయతీ పరిధిలోని భోగపర్తి గ్రామానికి తూర్పు ఆగ్నేయ ప్రాంతంలో 1.23 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రీకృతమైనట్లు అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం 7.15 గంటలకు భూమి కంపించిందని, రిక్టార్ స్కేల్‌పై తీవ్రత 3గా నమోదైనట్లు తెలిపారు.
ఇదీ చూడండి:California Earthquake: కాలిఫోర్నియాలో 6.2 తీవ్రతతో భూకంపం
ఇండోనేసియాలో భారీ భూకంపం- సునామీ హెచ్చరికలు!