Earthquake In Jaipur : రాజస్థాన్ రాజధాని జైపుర్‌లో శుక్రవారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. . ఉదయం 4 గంటల సమయంలో తొలి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.4 గా నమోదైంది. ఆ తరువాత 20 నిమిషాలకు 3.1 తీవ్రతతో మరో భూకంపం వచ్చింది. మరో 5 నిమిషాల వ్యవధిలో 3.4 తీవ్రతతో మూడో భూకంపం నమోదైంది. జైపుర్‌లో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సిస్మాలజీ సెంటర్ తెలిపింది.
Earthquake Today Jaipur : గాఢనిద్రలో ఉన్నప్పుడు భూమి ఒక్కసారిగా కంపించడం వల్ల ప్రజలంతా ఏం జరుగుతుందో తెలియక భయాందోళనకు గురయ్యారు. కొంతమంది వీధుల్లోకి పరుగులు తీశారు. అయితే, ప్రస్తుతానికి ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని సమాచారం. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజె ఈ భూకంపం గురించి ట్విట్టర్ వేదికగా స్పందించారు. జైపుర్‌తో సహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో సైతం భూకంపం సంభవించినట్లు పేర్కొన్నారు. 'గంటలో మూడు సార్లు భూప్రకంపనలు వచ్చాయి. నా కుటుంబం మొత్తం నిద్రలోంచి లేచాం. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు' అని స్థానికుడు వికాస్ తెలిపాడు.