ఐరోపా సమాఖ్య ప్రతినిధులతో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ సమావేశమయ్యారు. జీ7 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం కోసం లండన్ వెళ్లిన ఆయన.. ఈయూ విదేశీ వ్యవహారాలు, భద్రతా విధానాల విభాగ ప్రతినిధి జోసెఫ్ బోరెల్ ఫాంటెల్స్తో భేటీ అయ్యారు. ఇండో పసిఫిక్, అఫ్గానిస్థాన్ అంశాలపై వీరిరువురు చర్చించారు.
అఫ్గాన్‌లో కాల్పుల విరమణ తక్షణమే అమలు కావాలని ఇరువురు స్పష్టం చేశారు. భారత్, ఈయూ దేశాల భద్రతకు విఘాతం కలిగించేలా అఫ్గాన్ నేలను ఉగ్రవాదులు ఉపయోగించకుండా చర్యలు తీసుకోవడం అత్యవసరమని అన్నారు. మానవహక్కుల కార్యకర్తలు, పాత్రికేయుల లక్ష్యంగా జరుగుతున్న దాడులను ఖండించారు. శాంతిని నెలకొల్పే ప్రక్రియలో తాలిబన్లు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.