రాజ్యాంగానికి కట్టుబడి ఉండే ప్రజలకు వారసత్య రాజకీయాల వల్ల ముప్పు వాటిల్లే ప్రమాదముందని వ్యాఖ్యానించారు ప్రధాని నరేంద్ర మోదీ. కుటుంబ పార్టీలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. రాజకీయ పార్టీలు తమ ప్రజాస్వామ్య స్వభావాన్ని కోల్పోయినప్పుడు రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతింటుందన్నారు. కాంగ్రెస్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో పాల్గొని ప్రసంగించారు ప్రధాని(PM Modi News).
"రాజకీయ పార్టీలు విలువలు కోల్పోయినప్పుడు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలుగుతుంది. రాజ్యాంగానికి కట్టుబడి ఉండే ప్రజలకు వారసత్వ పార్టీలు ఆందోళనకరం. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్ని కుటుంబ పార్టీలు ఉన్నాయో చూడండి. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం. ఒక పార్టీని ఓకే కుటుంబం తరతరాలుగా నడిపించడం, పార్టీ వ్యవస్థ మొత్తం కుటుంబానికే పరిమితం కావడం ప్రజాస్వామ్యానికి అతి పెద్ద సమస్య."
-ప్రధాని మోదీ
1950 తర్వాత ప్రతి సంవత్సరం రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించాల్సిందని మోదీ అన్నారు. ఎందుకు దీన్ని రూపొందించారో అందరికీ తెలియజేయాల్సిందన్నారు. కానీ కొంతమంది అలా చేయలేదని చెప్పారు. మనం చేసే పని సరైనదా? కాదా? అని విశ్లేషించుకోవడానికి ప్రతి ఏటా రాజ్యాంగ దినోత్సవం జరపాలని సూచించారు. ఎంతో మంది మేధావులు తమ మెదడుకు పదునుపెట్టి, అహర్నిశలు శ్రమించి రాజ్యాంగాన్ని రూపొందించారని గుర్తు చేశారు(modi constitution).