పెళ్లి చేయండని సీఎంకు, పోలీసులకు పదే పదే విజ్ఞప్తి చేసిన ఉత్తర్‌ప్రదేశ్ మరుగుజ్జు మనిషి అజీమ్ అన్సారీ.. అనేక సార్లు వార్తల్లో నిలిచాడు. ఎట్టకేలకు అతని పెళ్లి జరిగిపోయింది. తాజాగా ఇదే రాష్ట్రానికి చెందిన మరో మరుగుజ్జు.. తనకు వివాహం చేయండని కోరుతూ జిల్లా మేజిస్ట్రేట్‌కు వినతి పత్రం అందజేశాడు. ఓ ఇల్లాలిని వెతికి పెట్టండంటూ వేడుకున్నాడు.
'ఏకాంతంగా ఉంటున్నా.. నాకు పెళ్లి చేయండి'.. మేజిస్ట్రేట్‌ను కోరిన మరుగుజ్జు - పెళ్లి కోసం మరుగుజ్జు దరఖాస్తు
ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో మరుగుజ్జు వ్యక్తి పెళ్లి కోసం జిల్లా మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించాడు. ఇంట్లో ఏకాంతంగా ఉంటున్నానని.. తోడును వెతికి పెట్టాలని విజ్ఞప్తి చేశాడు.
రాయ్‌బరేలి జిల్లా హారాజ్‌గంజ్ తహసీల్‌కు చెందిన మొహమ్మద్ షరీఫ్(40) కేవలం రెండున్నర అడుగులు మాత్రమే ఉంటాడు. దీని కారణంగా అతను ఎటువంటి కష్టతరమైన పనులు చేయలేడు. దాంతో కుటుంబ సభ్యులు అతన్ని ఇంట్లో నుంచి బయటకు వెళ్లగొట్టారు. అప్పుడు అధికారులను అభ్యర్థించగా.. ప్రభుత్వం తరఫున అతనికి ఒక ఇల్లు మంజూరైంది. ప్రస్తుతం అందులోనే నివసిస్తున్నాడు షరీఫ్.
అయితే, ఏకాంతంగా ఉండటం వల్ల మానసికంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని షరీఫ్ చెబుతున్నాడు. తనకు వివాహం జరిపించాలని జిల్లా మేజిస్ట్రేట్‌ను వేడుకున్నాడు. ఆర్థిక సహాయం అందించాల్సిందిగా విన్నవించాడు. ప్రభుత్వం తరుపున సంక్షేమ పథకాలు మంజూరు చేయాలని అభ్యర్థించాడు. విజ్ఞప్తి స్వీకరించిన జిల్లా మేజిస్ట్రేట్ మాల శ్రీవాస్తవ. అందుకు తగినట్లుగా చర్యలు తీసుకుంటామని షరీఫ్‌కు హామీ ఇచ్చారు.