Dussehra 2023 Date : ఈ ఏడాది.. ఏ పండగ ఎప్పుడు జరుపుకోవాలనే విషయంలో "డబుల్ ట్రబుల్" వెంటాడుతోంది. ఈ ఏడాది అధిక మాసం కారణంగా.. ప్రతి పండక్కీ రెండు డేట్లు వస్తుండడంతో.. ఏ రోజు అసలు పండగ జరుపుకోవాలో తెలియక జనం సతమతమవుతున్నారు. ఈ మధ్యకాలంలో జరుపుకున్న రాఖీ, వినాయక చవితి విషయంలోనూ అదే కన్ఫ్యూజన్ ఎదురైంది. ఇప్పుడు.. అతిముఖ్యమైన పండగ దసరా(Dussehra 2023) విషయంలోనూ అదే సందిగ్ధత నెలకొంది. ఇంతకీ దసరా ఎప్పుడు జరుపుకోవాలి? ఈ నెల 23న లేక 24వ తేదీనా? పండితులు ఏం చెబుతున్నారు? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Dussehra Significance in Telugu :ప్రతి ఏటా ఆశ్వయుజ మాసం శుద్ధ దశమి నాడు.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసరా జరుపుకోవడం ఆనవాయితీ. పురాణాల ప్రకారం.. ఈ విజయదశమి రోజున దుర్గా మాత మహిషాసురుడిని వధించిందని ఒక కథనం చెబుతుండగా.. రావణుడిని అంతం చేసి.. సీతమ్మను రాక్షసుల చెర నుంచి విడిపించి రాములవారు అయోధ్యకు తిరిగి వచ్చారని మరో కథనం. ఈ విజయానికి గుర్తుగా ఉత్తరాదిన విజయదశమి నాడు రావణ, కుంభకర్ణ, ఇంద్రజిత్తుల దిష్టిబొమ్మలను దహనం చేయడం జరుగుతోంది.
వైదిక క్యాలెండర్ ప్రకారం విజయ దశమి ముహూర్తం ఎప్పుడంటే..?వైదిక క్యాలెండర్ ప్రకారం అశ్వయుజ మాసం శుక్ల పక్ష దశమి తిథి.. ఈ సారి రెండు రోజుల్లో కలిపి వచ్చింది. అక్టోబర్ 23వ తేదీ సోమవారం సాయంత్రం 05.44 గంటలకు ప్రారంభమై.. అక్టోబర్ 24 మంగళవారం మధ్యాహ్నం 03:14 గంటలకు ముగుస్తుంది. అలాగే అక్టోబర్ 24 మంగళవారం మధ్యాహ్నం 02:18 గంటల నుంచి 03:05 గంటలకు విజయ్ ముహూర్తం, అదేరోజు మధ్యాహ్నం 01:32 గంటల నుంచి 03:51 గంటల వరకు అపరహ్న పూజా సమయం ఉంది.
పండితులు ఏం చెబుతున్నారంటే.. అక్టోబర్ 23, 24 తేదీల్లో ఏరోజు కూడా దశమి తిథి పూర్తిగా లేనందున.. ఇలాంటి పరిస్థితుల్లో శ్రవణ యోగం ఉన్న రోజునే పరిగణలోకి తీసుకోవాలని పండితులు చెబుతున్నారు. దాని ప్రకారం చూస్తే 23న శ్రావణ యోగం ఉంది. కావునా.. ఈ నెల 23వ తేదీనే మహర్నవమి, విజయదశమి జరుపుకోవడం మంచిదని పండితులు పేర్కొంటున్నారు. 24న మధ్యాహ్నం తర్వాత దశమి తిథి ఉన్నా కూడా.. పూర్వదినాన్ని గ్రహించాలని చెబుతున్నారు.