మూఢనమ్మకాలతో కొన్నిచోట్ల ప్రజలు అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. ఝార్ఖండ్ సాహిబ్‌గంజ్‌లోని ఓ ప్రాంతంలో ఇలాంటి ఘటనే బయటపడింది.
పథ్తర్చట్టీకి చెందిన బిపోతీ మండల్ కుమారుడు మున్నా(8).. అక్టోబర్ 1 సాయంత్రం తన ఇంటి సమీపంలో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. అతడి కాలుపై పాము కాట్లు ఉన్నట్లు గుర్తించిన గ్రామస్థులు.. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆ బాలుడు చనిపోయినట్లు నిర్ధరించారు వైద్యులు.
మున్నా తండ్రి పొట్టకూటి కోసం కేరళలో కూలీపని చేస్తున్నాడు. అతడు.. ఝార్ఖండ్‌లోని ఇంటికి వచ్చే సరికి ఎలాగూ ఆలస్యం అవుతుందని గ్రహించిన బంధువులకు ఒక ఉపాయం తట్టింది. అదే వారి మూఢనమ్మకం. అరటిచెట్టు కాడలతో.. ఒక బెడ్‌లా అమర్చి, అలంకరించి దానిపై బాలుడి మృతదేహాన్ని ఉంచి సోభాపుర్లోని గంగా ఘాట్‌లోకి వదిలారు.
దేవుడు కోరుకుంటే.. తప్పకుండా ఆ బాలుడు మళ్లీ బతికొస్తాడని వారు నమ్మారు. నీరు లోపలకు వెళ్లి.. విషం బయటకు వస్తుందన్న అతివిశ్వాసంతోనే నదిలో విడిచిపెట్టారు. గ్రామస్థులందరూ అక్కడకు వెళ్లారు.
ఇలా చేయొద్దు..
అయితే.. ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఆస్పత్రి వైద్యులు మూఢనమ్మకాలకు ఇదో చెత్త ఉదాహరణ అని అన్నారు. మారుమూల గ్రామాల్లో ఇప్పటికీ పాముకాటు వంటి ఘటనలు జరిగినప్పుడు నిర్లక్ష్యంగా ఉంటూ ఆస్పత్రులకు వెళ్లాలనుకోవట్లేదని అంటున్నారు. ఇప్పుడు ఆస్పత్రుల్లో అన్ని వసతులు, ఔషధాలు ఉంటున్నాయన్నారు.
ఇలాంటి ఘటనలు గతంలోనూ చాలానే జరిగాయి.