AIADMK general council meeting: తమిళనాడు ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకేలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పార్టీలో ద్వంద్వ నాయకత్వ వ్యవస్థ రద్దైనట్లు ప్రకటించారు ఆ పార్టీ సీనియర్ నేత షణ్ముగం. గురువారం జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఈ పోస్టులకు ఆమోదం తెలపక పోవడం వల్ల రద్దు అయినట్లు తెలిపారు. పార్టీలోని రెండు ప్రధాన పదవులకు సంబంధించిన ఈ సవరణలను 2021డిసెంబర్ 1న చేశారు. అనంతరం కోఆర్డినేటర్‌గా పన్నీర్‌సెల్వం, జాయింట్ కోఆర్డినేటర్‌గా పళనిస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సవరణల ప్రకారం ఈ పదవులకు ఎన్నిక కావాలంటే పార్టీ ప్రాథమిక సభ్యుల ఓటు అవసరం. కానీ ఈ సవరణలను జనరల్ కౌన్సిల్ ఆమోదించినందున.. పన్నీర్ సెల్వం కోఆర్డినేటర్, పళనిస్వామి జాయింట్ కోఆర్డినేటర్ పోస్టులు రద్దైనట్లు ఆయన వెల్లడించారు. వీరు తమ పాత పోస్టుల్లోనే కొనసాగుతారని పేర్కొన్నారు. అంతకుముందు పన్నీర్‌సెల్వం కోశాధికారి హోదాలో ఉండగా.. పళనిస్వామి కేంద్రకార్యాలయ కార్యదర్శిగా ఉన్నారు. మరోవైపు జులై 11న జరిగే జనరల్ కౌన్సిల్ సమావేశంలో పళనిస్వామిని నాయకుడిగా ఎన్నుకునేందుకు ఆయన వర్గం పావులు కదుపుతోంది.
గురువారం జరిగిన సమావేశంలో ఒకరి నాయకత్వంలోనే పార్టీ నడవడానికే పళనిస్వామి(ఈపీఎస్) క్యాంప్‌కు ఎక్కువ మంది నేతలు మొగ్గు చూపారు. దీంతో సమావేశం మధ్యలోనే పార్టీ సమన్వయకర్త పన్నీర్ సెల్వం తన మద్దతుదారులతో వాకౌట్ చేశారు. పార్టీ డిప్యూటీ సెక్రటరీ ఆర్.వైతిలింగంతో సహా ఓపీఎస్ మద్దతుదారులంతా మీటింగ్ హాల్ నుంచి వెళ్లిపోయారు. ఆ సమయంలో పళనిస్వామి వర్గానికి చెందిన కొందరు తీవ్రస్థాయిలో ఓపీఎస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన వైపు నీళ్ల సీసాలను విసిరారు. పన్నీర్‌సెల్వం కారు టైర్లలో గాలి కూడా తీసేశారు. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య సమావేశం కేవలం 40 నిమిషాల్లోనే ముగిసింది.