తమిళనాడులో కడలూరు జిల్లాలో విషాదం నెలకొంది. డిసెంబరు 31న రాత్రి నూతన సంవత్సరం వేడుకల్లో ఓ వ్యక్తి పాముకాటుతో మరణించాడు. అతడితో పాటు ఉన్న మరో వ్యక్తికి కూడా పాము కాటేయగా.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
న్యూ ఇయర్ వేడుకల్లో పాము కాటుతో వ్యక్తి మృతి.. 'స్పెషల్ గిఫ్ట్' అంటూ అరవడం వల్లే! - న్యూ ఇయర్ వేడుకలలో పాముకాటుతో వ్యక్తి మృతి న్యూస్
నూతన సంవత్సరం వేడుకల్లో మద్యం సేవించిన ఓ వ్యక్తి.. హల్చల్ చేశాడు. అటుగా వెళ్తున్న ఓ పామును పట్టుకుని న్యూఇయర్ గిఫ్ట్ అంటూ అరిచాడు. రెప్పపాటులో ఆ సర్పం అతడిని కాటువేయగా.. మృతి చెందాడు. తమిళనాడులో జరిగిందీ ఘటన.
అసలేం జరిగిందంటే?
స్థానికుల సమాచారం ప్రకారం.. నూతన సంవత్సర వేడుకలలో మణికందన్ అలియాస్ పప్పు అనే వ్యక్తి పాల్గొన్నాడు. మద్యం ఫూటుగా సేవించి వచ్చాడు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ పామును చూసి పట్టుకున్నాడు. తర్వాత ఆ సర్పాన్ని న్యూ ఇయర్ గిఫ్ట్ అని తన స్నేహితులకు చూపించి అరిచాడు. అది చూసిన వారంతా భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు.
అయితే రెప్పపాటులో ఆ పాము మణికందన్‌ను కాటేసింది. వెంటనే అతడు స్పృహ తప్పి పడిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న మణికందన్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. మార్గమధ్యలోనే మృతి చెందాడు. మణికందన్‌తో పాటు వచ్చిన మరో వ్యక్తి కపిలన్‌ను కూడా ఆ పాము కాటేసింది. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాటేసిన పామును స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అది రసెల్ జాతి సర్పం అని వైద్యులు తెలిపారు.