మద్యం మత్తులో ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు హల్చల్ చేశాడు. దిల్లీ-బెంగళూరు వెళ్తున్న ఇండిగో విమానంలో అత్యవసర ద్వారాన్ని తెరవడానికి ప్రయత్నించాడు. అతడిని విమాన సిబ్బంది నిలువరించారు. ఈ ఘటనలో కాన్పుర్‌కు చెందిన ప్రయాణికుడు ప్రతీక్ (30)ను సీఐఎస్ఎఫ్ సిబ్బందికి అప్పగించినట్లు ఇండిగో పేర్కొంది. ప్రయాణికుడిపై అధికారులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపింది.
"దిల్లీ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఇండిగో ఫ్లైట్‌లో ఓ ప్రయాణికుడు మద్యం మత్తులో ఎమర్జెనీ డోర్‌ను తెరిచేందుకు ప్రయత్నించాడు. అలాగే ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగించాడు. వెంటనే విమాన సిబ్బంది అప్రమత్తమయ్యారు. ప్రయాణికుడిని నిలువరించారు. బెంగళూరు చేరుకున్న తర్వాత ప్రయాణికుడిని సీఐఎస్ఎఫ్ సిబ్బందికి అప్పగించారు."
--ఇండిగో అధికారులు
'పొరపాటున తలుపు తీశారు'
బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య గతేడాది డిసెంబరులో ఇండిగో విమానంలో ఎమర్జెన్సీ డోర్‌ను తెరిచినట్లు వచ్చిన వార్తలు తీవ్ర దుమారం రేపాయి. ఈ ఘటనలో బీజేపీ యువ ఎంపీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందించారు. పొరబాటుగానే తేజస్వీ సూర్య ఆ తలుపుల్ని తెరిచినట్లు పేర్కొన్నారు.
చెన్నై-తిరుచ్చి ఇండిగో విమానంలో జరిగిందీ ఘటన. తమ విమానంలో ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ను పొరబాటుగా తెరిచారని ఇండిగో ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇందుకు ఆ ప్రయాణికుడు క్షమాపణ చెప్పినట్లు పేర్కొంది. అయితే, ఆ ప్రయాణికుడు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యనే అని కాంగ్రెస్ బయటపెట్టింది. టేకాఫ్‌కు ముందే ఈ ఘటన జరగడం వల్ల ప్రమాదం తప్పిందనీ, లేదంటే ప్రయాణికుల ప్రాణాలకు ముప్పువాటిల్లి ఉండేదని పేర్కొంది. ఈ విషయాన్ని ప్రభుత్వం దాచిపెట్టిందని దుయ్యబట్టింది. అయితే దీనిపై పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) స్పందిస్తూ.. ఘటన తమ దృష్టికి వచ్చిందని, భద్రతాపరమైన లోపాలేమీ లేవని పేర్కొంది.
ప్రయాణికురాలిపై మూత్రం..
గతేడాది నవంబరులో న్యూయార్క్ నుంచి దిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో తన తోటి ప్రయాణికురాలి(70)పై ఓ వ్యక్తి మద్యం మత్తులో మూత్ర విసర్జన చేశాడు. బాధిత మహిళ టాటా గ్రూప్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌కు లేఖ రాసిన తర్వాత.. ఈ విషయం బహిర్గతమైంది. ఘటన జరిగిన సమయంలో ఎయిరిండియా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధిత మహిళ ఆరోపించారు. దీంతో ఎయిరిండియాపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీనిపై విచారం వ్యక్తం చేస్తూ లేఖ రాశారు టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్. తమ ఉద్యోగులు త్వరితగతిన స్పందించాల్సిందని అన్నారు. అయితే, తాను మహిళపై మూత్ర విసర్జన చేయలేదని నిందితుడు వాదిస్తున్నాడు. ఆ మహిళే తనకు తాను మూత్ర విసర్జన చేసుకుందని న్యాయస్థానంలో చెప్పాడు. ఆ వ్యాఖ్యలను బాధితురాలు ఖండించారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.