భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్, సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేసిన కొవిషీల్డ్ టీకాలను బహిరంగ మార్కెట్లో విక్రయించేందుకు అవసరమైన సాధారణ అనుమతిని భారత ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐ మంజూరు చేసింది. కొన్ని షరతులకు లోబడి వయోజనుల ఉపయోగం కోసం బహిరంగ మార్కెట్‌లో కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాల విక్రయానికి అనుమతించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు.
గతంలో కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలకు ఇచ్చిన అత్యవసర వినియోగ అనుమతిని.. సాధారణ కొత్త ఔషధ అనుమతిగా డీసీజీఐ అప్‌గ్రేడ్ చేసినట్లు మంత్రి తెలిపారు. న్యూ డ్రగ్స్ అండ్ క్లినికల్ ట్రయల్స్ రూల్స్ 2019 కింద రెండు టీకాలకు రెగ్యులర్ మార్కెట్ అప్రూవల్ మంజూరు చేసినట్లు వివరించారు. ప్రస్తుతం జరుగుతున్న క్లినికల్ ట్రయల్స్ సమాచారం, ప్రోగ్రామాటిక్ సెట్టింగ్ కోసం సరఫరా చేసిన టీకాల డేటా, కొవిన్ ప్లాట్‌ఫామ్‌లో నమోదైన వ్యాక్సినేషన్ వివరాలను ఆయా సంస్థలు సమర్పించాల్సి ఉంటుందని డీసీజీఐ వర్గాలు తెలిపాయి. ప్రతి ఆర్నెళ్లకోసారి.. సేఫ్టీ డేటా అందజేయాలనే షరతు విధించాయి. ప్రతికూల ప్రభావాలపై సైతం పర్యవేక్షణ కొనసాగుతుందని స్పష్టం చేశాయి.
భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్, సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేసిన కొవిషీల్డ్‌ల టీకాల అత్యవసర వినియోగానికి గతేడాది జనవరిలో అనుమతి లభించింది. అనంతరం బహిరంగ మార్కెట్లో విక్రయానికి అనుమతించాలంటూ ఆయా సంస్థలు ఇటీవలి కాలంలో డీసీజీఐకు దరఖాస్తు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని షరతులకు లోబడి వయోజనులకు ఇచ్చేందుకు కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలకు సాధారణ అనుమతి ఇవ్వాలంటూ సీడీఎస్సీఓకు చెందిన నిపుణుల కమిటీ జనవరి 19న డీసీజీఐకి సిఫార్సు చేసింది. ఆ సిఫార్సుల మేరకు కొవాగ్జిన్, కొవిషీల్డ్‌లను బహిరంగ మార్కెట్లో విక్రయించేందుకు డీసీజీఐ షరతులతో కూడిన సాధారణ అనుమతులు మంజూరు చేసింది.