Murmu President of India: భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సమక్షంలో ఆమె బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, గవర్నర్లు, పలు రాష్ట్రాల సీఎంలు, పార్లమెంటు సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
సంప్రదాయబద్ధంగా నిర్వహించే ఊరేగింపుతో ముర్ము సెంట్రల్ హాలుకు చేరుకున్నారు. జస్టిస్ ఎన్వీ రమణ.. రాజ్యాంగంలోని ఆర్టికల్-60 ప్రకారం ఆమెతో ప్రమాణం చేయించారు. ఆ వెంటనే సైన్యం 21 సార్లు గాల్లోకి కాల్పులు జరిపి నూతన రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పించింది. ప్రమాణ స్వీకారానికి ముందు ముర్ము వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత దిల్లీలోని రాజ్‌ఘాట్‌ను సందర్శించి మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. అనంతరం.. రాష్ట్రపతి భవన్‌కు వెళ్లగా.. రామ్‌నాథ్ కోవింద్ దంపతులు ముర్ముకు అభినందనలు తెలిపారు.
రాష్ట్రపతిగా తన ఎన్నిక కోట్లాది భారతీయుల విశ్వాసానికి ప్రతీక అని అన్నారు ముర్ము. ఈ గెలుపు తన ఒక్కరి ఘనత కాదని.. దేశ ప్రజలందరికీ దక్కిన విజయమని అభిప్రాయపడ్డారు. పేద ప్రజలు కలలు కని.. నిజం చేసుకోగలరనేందుకు తన ఎన్నికే నిదర్శనం అని పేర్కొన్నారు. రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారి ప్రసంగించిన ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
''దేశ ప్రజల విశ్వాసం నిలబెట్టుకునేందుకు కృషి చేస్తా. భారత్ 'ఆజాదీకా అమృత్ మహోత్సవ్' ఉత్సవాలు జరుపుకుంటోంది. ఉత్సవాల వేళ రాష్ట్రపతిగా ఎన్నిక కావడం సంతోషంగా ఉంది. 50 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకల వేళ నా రాజకీయ జీవితం ప్రారంభమైంది. 75 ఏళ్ల ఉత్సవాల వేళ రాష్ట్రపతిగా ఎన్నిక కావడం సంతోషంగా ఉంది. ఒడిశాలోని చిన్న ఆదివాసీ గ్రామం నుంచి వచ్చి.. అత్యున్నత పదవి చేపట్టడం గౌరవంగా భావిస్తున్నా.'' అని అన్నారు ద్రౌపది.
ప్రసంగం తర్వాత రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు ద్రౌపదీ ముర్ము. అక్కడ రాష్ట్రపతిగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో రామ్‌నాథ్ కోవింద్.. ముర్ము వెంటే ఉన్నారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. అధికారిక ట్విట్టర్ ఖాతాను ముర్ముకు బదిలీ చేశారు.