తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ముర్ము' స్వగ్రామానికి కరెంట్.. ఏళ్లుగా పడుతున్న బాధలకు మోక్షం​!

Murmu Village Electricity: ఇన్నాళ్లుగా ఆ గ్రామంలో కరెంటు లేదు. చీకట్లోనే మగ్గుతూ కాలం వెళ్లదీశారు జనం. అయితే ఉన్నట్లుండి.. రంగంలోకి దిగిన అధికారులు విద్యుత్​ స్తంభాలు, ట్రాన్స్​ఫార్మర్లు, గుంతలు తవ్వే యంత్రాలతో యుద్ధప్రాతిపదికన పనులు మొదలుపెట్టారు. కారణం ద్రౌపది ముర్మును భాజపా.. రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం. ముర్ము స్వగ్రామమే మరి ఇది.

Droupadi Murmu Ancestors Village has no Electricity
Droupadi Murmu Ancestors Village has no Electricity

By

Published : Jun 26, 2022, 10:50 PM IST

Murmu Village Electricity: గ్రామం ఎన్నో ఏళ్లుగా చీకట్లో మగ్గుతోంది. తమ ప్రాంతానికి కరెంటు వసతి కల్పించాలని ఎంతో కాలంగా స్థానికులు వేడుకుంటున్నప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. అయితే, ఇటీవల ఆ గ్రామం జాతీయస్థాయి వార్తల్లో నిలవడంతో అప్రమత్తమైన ఒడిశా ప్రభుత్వం.. వెంటనే ఆ గ్రామానికి కరెంటు వసతి కల్పిస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు.. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, గుంతలు తవ్వే యంత్రాలతో అక్కడకు చేరుకొని యుద్ధప్రాతిపదికన పనులు మొదలుపెట్టారు. దీంతో ఎన్నో ఏళ్లుగా పడుతున్న బాధలకు ఇప్పుడు మోక్షం లభించిందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదీ రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీలో ఉన్న ద్రౌపదీ ముర్ము స్వగ్రామంలో పరిస్థితి.

ఎన్డీఏ తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో ఉన్న ద్రౌపదీ ముర్ము స్వగ్రామం ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతం. అయితే, ప్రస్తుతం ఆమె అక్కడ నివసించడం లేదు. ఆ గ్రామానికి 20కి.మీ దూరంలో ఉన్న పట్టణానికి కొన్ని దశాబ్దాల క్రితమే మకాం మార్చారు. అయినప్పటికీ ముర్ము మేనల్లుడు బిరాంచి నారాయన్‌ తుడు ఆయన భార్య, ఇద్దరు పిల్లలతో అక్కడే నివసిస్తున్నారు.

అయితే, దాదాపు 3500 జనాభా కలిగిన ఉపర్బెడా (రెండు చిన్న పల్లెలు) మాత్రం ఎన్నో ఏళ్లుగా చీకట్లోనే మగ్గుతోంది. బాదాసాహి అనే పల్లెకు విద్యుత్‌ ఉన్నప్పటికీ పదుల సంఖ్యలో కుటుంబాలున్న దున్‌గుర్‌సాహికి మాత్రం కరెంటు వసతి లేదు. ఇప్పటికీ వారికి కిరోసిన్‌ దీపాలే దిక్కు. అయితే, రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపదీ ముర్ము బరిలో నిలవగానే ఆమె గురించి తెలుసుకునేందుకు మీడియా ప్రతినిధులు ఈ గ్రామానికి వెళ్లారు. ముర్ము గురించి స్థానికులతో ముచ్చటించినప్పుడు అక్కడ కరెంటు లేదనే విషయం బయటపడింది. 'ఇదే విషయాన్ని ఎన్నోసార్లు విన్నవించినప్పటికీ అధికారులు మాత్రం పట్టించుకోలేదు. 2019 ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే, ఎంపీలకు మొరపెట్టుకున్నా ఇప్పటివరకు మా గోడు ఎవ్వరూ పట్టించుకోలేదు' అని బిరాంచి భార్య వాపోయారు. అయితే, పండగల వేళ ముర్ము తమ గ్రామానికి వచ్చినప్పటికీ ఈ విషయాన్ని మాత్రం ఆమె దృష్టికి తీసుకువెళ్లలేదన్నారు.

ఈ విషయం వార్తల్లో నిలవడంతో ఉత్తరఒడిశా విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీపీఎన్​ఓడీఎల్​) అధికారులు స్పందించారు. 24 గంటల్లోగా గ్రామం మొత్తానికి విద్యుత్‌ వసతి అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. దీంతో ఉపర్బెడా గ్రామంలో వాలిపోయిన అధికారులు.. విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, గుంతలు తవ్వే యంత్రాలతో చేరుకొని పనులు మొదలుపెట్టారు. ఇదిలాఉంటే, మయూర్‌భంజ్‌ జిల్లాలో ఇప్పటికీ ఓ 500 గ్రామాలకు సరైన రోడ్లు, 1350 గ్రామాలకు కరెంటు వసతే లేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే, ఈ గ్రామానికి చెందినవారు గతంలో ఎంపీలు, మంత్రులుగా పనిచేశారు. మాజీ ఎంపీలు సల్ఖాన్‌ ముర్ము, భబేంద్ర మాఝీతోపాటు కార్తిక్‌ మాఝీలు కూడా అదే గ్రామానికి చెందిన వారు కావడం విశేషం.

ఇవీ చూడండి:'గిరిజనుల కోసం ముర్ము కన్నా ఎక్కువే చేశా'

ముర్ముకు 'జెడ్‌ ప్ల‌స్' భ‌ద్ర‌త.. ఆల‌యాన్ని శుభ్రం చేసిన రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి

ABOUT THE AUTHOR

...view details