Drone Attack On Ship India :అరేబియా సముద్రంలో డ్రోన్ దాడికి గురైన వాణిజ్య నౌక MV కెమ్ ఫ్లూటో ఎట్టకేలకు ముంబయి హార్బర్‌కు చేరింది. దాన్ని ప్రాథమికంగా పరిశీలించిన భారత నావికాదళం డ్రోన్ దాడికి గురైందని నిర్ధరించింది. దెబ్బతిన్న నౌక భాగాల ఫొటోలు విడుదల చేసింది. మరిన్ని వివరాల కోసం ఫోరెన్సిక్ దర్యాప్తు చేసిన తర్వాత మరమ్మతులు చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
హమాస్‌కు మద్దతుగా హౌతీ రెబల్స్ ఎర్రసముద్రంలో ప్రయాణిస్తున్న నౌకలపై దాడులు చేస్తున్న నేపథ్యంలో ఫ్లూటో నౌకపై డ్రోన్ దాడి జరిగింది. హౌతీలే దాడి చేశారని అమెరికా తెలిపింది. లైబేరియా జెండా ఉన్న ప్లూటో భారత్‌లోని మంగుళూరు పోర్టుకు వస్తుండగా పోర్‌బందర్‌కు 217 నాటికల్ మైళ్ల దూరంలో దాడి జరిగింది. భారత కోస్టుగార్డు నౌక ICGS విక్రమ్ రెస్క్యూ చేపట్టింది. అందులోని 21 మంది భారతీయులతో పాటు వియత్నాం వాసి సురక్షితంగా బయటపడ్డారు. ICGS నౌక ఎస్కార్ట్‌గా రక్షణ కల్పిస్తుండగా, ఎంవీ ఫ్లూటో ముంబయి తీరానికి వచ్చింది. మరోవైపు నౌకలపై దాడుల దృష్ట్యా అరేబియా సముద్రంలో నిఘా కోసం P-8I గస్తీ విమానాలు, INS మొర్ముగో, INS కొచ్చి, INS కోల్‌కతా యుద్ధనౌకలను ఇండియన్ నేవీ మోహరించింది.