new traffic rules Punjab:పంజాబ్‌లో ఇకపై ఎవరైనా అదుపులేని వేగంతో లేదా మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తే సామాజిక సేవ గానీ, రక్తదానం గానీ చేయాల్సి ఉంటుంది. ఇలా పట్టుబడిన వారికి జరిమానా విధిస్తూనే ఇలాంటి కార్యక్రమాలు కూడా చేయిస్తారు. ఈమేరకు వివిధ రకాల ట్రాఫిక్ ఉల్లంఘనలపై చేపట్టే చర్యలకు సంబంధించి రాష్ట్ర రవాణా శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఎవరైనా పరిమితికి మించిన వేగంతో డ్రైవింగ్ చేస్తూ తొలిసారి పట్టుబడితే వెయ్యి రూపాయలు, మళ్లీ దొరికితే రూ. 2,000 చొప్పున జరిమానా ఉంటుంది. అదే మద్యం లేదా మాదకద్రవ్యాల మత్తులో బండి నడుపుతూ దొరికితే మొదటిసారి రూ. 5,000.. తర్వాత రూ. 10,000 విధిస్తారు. ఇలా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వ్యక్తులు రవాణా శాఖ నిర్దేశించే ఓ కోర్సును చేయాల్సి ఉంటుంది. అనంతరం దీనిపై సమీపంలోని పాఠశాలలో కనీసం 20 మంది (9 నుంచి 12 తరగతుల) విద్యార్థులకు 2 గంటలకు పైగా బోధించాలి. అలాగే సమీపంలోని ఓ ఆసుపత్రిలో కనీసం 2 గంటల పాటు సామాజిక సేవ లేదా ఒక యూనిట్ రక్తం దానం చేయాలి.