తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సంచిలో శవం.. కాంక్రీట్ ఫ్లోరింగ్ వేసి మాయం.. రియల్​ లైఫ్​లో 'దృశ్యం'!

హత్య.. గోనె సంచిలో శవం.. ఎవరికీ తెలియకుండా గోతిలో పెట్టి, రాత్రికి రాత్రే కాంక్రీట్​తో ఫ్లోరింగ్​.. దృశ్యం సినిమాను తలపిస్తున్న ఈ ఘటన కేరళలో నిజంగా జరిగింది. ఫ్లోరింగ్ బద్దలుకొట్టి మృతదేహాన్ని బయటకు తీసిన పోలీసులు.. ఏం జరిగిందో తేల్చే పనిలో ఉన్నారు.

Drishyam style murder in Kerala Kottayam
సంచిలో శవం.. కాంక్రీట్ ఫ్లోరింగ్ వేసి మాయం.. రియల్​ లైఫ్​లో 'దృశ్యం'!

By

Published : Oct 2, 2022, 8:49 AM IST

ఓ వ్యక్తి మిస్సింగ్​ కేసులో కేరళ పోలీసుల దర్యాప్తు.. 'దృశ్యం' సినిమాను తలపించే క్లైమాక్స్​కు దారితీసింది. నిందితులు.. హత్య చేసి, శవాన్ని ఇంట్లోనే గోనె సంచిలో కట్టి, గోతిలో పెట్టి, పైన కాంక్రీట్​తో ఫ్లోరింగ్​ చేశారని తేలింది. ఫ్లోరింగ్ బద్దలుకొట్టి మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు.. డీఎన్​ఏ పరీక్షలకు పంపారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ఒక్క ఫోన్​ కాల్​తో..
కొట్టాయం జిల్లాకు చెందిన బిందు కుమార్​(40) వారం క్రితం అలప్పుజలో అదృశ్యమయ్యాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు 'అలప్పుజ నార్త్' పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అతడి కాల్ రికార్డ్స్ పరిశీలించారు. చివరిసారిగా కొట్టాయం జిల్లా చంగనేస్సరికి చెందిన ముత్తు కుమార్​తో బిందు కుమార్​ ఫోన్​లో మాట్లాడినట్లు తెలిసింది.

బిందు కుమార్

పోలీసులు.. ముత్తు కుమార్ ఇంటికి వెళ్లేసరికి అతడు లేడు. చుట్టుపక్కల వాళ్లను అధికారులు ప్రశ్నించారు. కొద్దిరోజులుగా ముత్తు కుమార్ ఇంట్లో ఫ్లోరింగ్ మరమ్మతు పనులు జరుగుతున్నాయని స్థానికులు చెప్పారు. అదే సమయంలో బిందు కుమార్ బైక్.. చంగనేస్సరికి సమీపంలోని వకతానంలో దొరికింది.

ముత్తు కుమార్​పై పోలీసులకు మరింత అనుమానం కలిగింది. అన్ని అనుమతులు తీసుకుని.. అతడి ఇంట్లో కొత్తగా వేసిన ఫ్లోరింగ్​ను అధికారులు బద్దలుకొట్టించారు. 30 నిమిషాల్లో తవ్వితే.. ఓ మూట బయటపడింది. అందులో ఓ మృతదేహం ఉంది. అది బిందు కుమార్​దేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ విషయం నిర్ధరించే పరీక్షల కోసం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details