ప్లాస్టిక్ కప్పులో టీ తాగితే హానికరమని తెలుసు. అందుకే వాటికి ప్రత్యామ్నాయంగా ఒకసారి వాడిపారేసే(డిస్పోజబుల్) పేపర్ కప్పుల్ని విరివిగా వినియోగిస్తున్నాం. అయితే ఈ పేపర్ కప్పుల్లో టీ తాగినా హానికరమేనని ఖరగ్పుర్ ఐఐటీ అధ్యయనంలో తేలింది.
పేపర్ కప్పులో టీ తాగుతున్నారా? జర జాగ్రత్త
పర్యావరణ హితమని పేపర్ కప్పులో టీ తాగుతున్నారా..? అయితే జాగ్రత్తపడండి. వాటిల్లోనూ ప్లాస్టిక్ రేణువులు ఉంటాయని, అవి ఆరోగ్యానికి హానికరమని ఓ ఐఐటీ అధ్యయనం చెప్తోంది. ఒక పేపర్ కప్పులో సుమారు 25వేల మైక్రో ప్లాస్టిక్ కణాలు ఉంటాయని అందులో స్పష్టం చేశారు పరిశోధకులు.
"పేపర్ కప్పుల్లో వేడి ద్రవం పోసినప్పుడు ఆ పేపర్లోని మైక్రో ప్లాస్టిక్ కణాలు, ఇతర ప్రమాదకర రేణువులు ద్రవంలో కలిసిపోతాయి. సాధారణంగా పేపర్ కప్పులు హైడ్రోఫోబిక్ ఫిల్మ్ కలిగిన సన్నటి పొరతో తయారవుతాయి. ఇందులోనూ పాలీ ఇథలీన్(ప్లాస్టిక్) ఉంటుంది. వేడి ద్రవం పోసిన 15 నిమిషాల్లోపే ఈ మైక్రోప్లాస్టిక్ లేయర్లో చర్య జరుగుతుంది" అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన అసోసియేట్ ప్రొఫెసర్ సుధాగోయెల్ చెప్పారు.
85-90 డిగ్రీల సెల్సియస్ వేడి ఉండే 100 ఎంఎల్ వేడి ద్రవంలోకి.. పేపర్ కప్పు నుంచి 25 వేల మైక్రోప్లాస్టిక్ రేణువులు విడుదలవుతాయి. ఈ రేణువుల్లో అయాన్లతో పాటు క్రోమియం, కాడ్మియం వంటి విషపూరిత భారీ లోహాలు ఉంటాయని ఆమె వివరించారు.