ఎండు మామిడి ఆకులతో కేరళ రైతుల వ్యాపారం Dried Mango Leaves Business: మామిడి పండ్లు కిలో ఎంత ఉంటాయి? 100 నుంచి 200 రూపాయలు. ఏదైనా ప్రత్యేక జాతులవైతే ఇంకాస్త ఎక్కువ. మరి మామిడి ఆకుల ధర ఎంత? ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా? కేరళలో ఇప్పుడిదే హాట్ టాపిక్. అక్కడ ఎండబెట్టిన మామిడి ఆకులు కిలో ధర 150 రూపాయలు మరి.
కేరళలోని కన్నూర్, కాసర్గోడ్లో మామిడి సాగు బాగానే జరుగుతుంది. అయితే.. అక్కడి రైతులంతా ఇప్పటివరకు సీజన్లో మామిడి పండ్లు ఎలా, ఎంతకు అమ్ముకోవాలనే దాని గురించే ఆలోచించేవారు. ఇప్పుడు మాత్రం లెక్క మారింది. ఓ కంపెనీ ఇచ్చిన ఆఫర్‌తో.. మామిడి ఆకుల వ్యాపారం మొదలైంది. అదనపు ఆదాయం లభిస్తోంది.
ఎండు మామిడి ఆకులతో పౌడర్ తయారీ 'ఈనో వెల్నెస్ నికా' అనే పళ్లపొడి కంపెనీ ఈ ఎండు మామిడి ఆకులు కొనుగోలు చేస్తోంది. ఆర్గానిక్ పళ్ల పొడికి ఇటీవలే పేటెంట్ పొందిన ఆ సంస్థ.. త్వరలోనే ఉత్పత్తి ప్రారంభించనుంది. అందుకు అవసరమైన ముడి సరకు కొనుగోలుపై ఇప్పుడు దృష్టిపెట్టింది. కన్నూర్, కాసర్గోడ్లోని గ్రామాలన్నింటికీ సిబ్బందిని పంపి మరీ.. ఎండిన మామిడి ఆకులు సేకరిస్తోంది.
ఈ మామిడి ఆకులు.. పరిశుభ్ర వాతావరణంలో సహజసిద్ధంగా రాలి, ఎండినవై ఉండాలి. వాటిని ఇస్తే ఒక్కో కిలోకు 150 రూపాయలు చెల్లిస్తోంది ఆ సంస్థ. డబ్బులు వద్దనుకున్నవారికి.. ప్రతి రెండు కిలోలకు ఆ సంస్థలో ఒక షేరు కేటాయిస్తోంది.
ఇదీ చూడండి :భర్త మృతితో చెదిరిన కల.. నిలువ నీడలేక కష్టాల కడలిలో ఎదురీత