రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ) వచ్చే మూడు నెలల్లో దేశ వ్యాప్తంగా 500 మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. పీఎం కేర్స్ ఫండ్ సాయంతో వీటిని నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌లో ఆన్‌బోర్డ్ ఆక్సిజన్ ఉత్పత్తికి ఉపయోగించిన సాంకేతికత మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్ (ఎంఓపీ) దేశ ఆక్సిజన్ అవసరాలు తీర్చడానికి ఉపయోగపడుతున్నట్లు రాజ్‌నాథ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
తాము అభివృద్ధి చేసిన ఎంఓపీ సాంకేతికతను బెంగళూరు టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్‌తో పాటు కోయంబత్తూర్‌లోని ట్రైడెంట్ న్యూమాటిక్స్‌కు బదిలీ చేసే ప్రక్రియ కొనసాగుతోందని డీఆర్‌డీఓ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ రెండు సంస్థలు 380 వరకు ప్లాంట్లు ఏర్పాటు చేస్తాయని వెల్లడించింది. నిమిషానికి 500 లీటర్ల కెపాసిటీతో మరో 120 ప్లాంట్లను డెహ్రాడూన్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం నిర్మించేలా చర్చలు సాగుతున్నట్లు వివరించింది.