భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ సరికొత్త సాంకేతికతను విజయవంతంగా పరీక్షించింది. క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్(క్యూకేడీ) సాంకేతికత ఉపయోగించి రెండు ల్యాబ్‌ల మధ్య కమ్యూనికేషన్ నెలకొల్పింది. హైదరాబాద్‌లోని రక్షణ పరిశోధన, అభివృద్ధి లేబొరేటరీ(డీఆర్డీఎల్), ద రీసెర్చ్ సెంటర్ ఇమ్రాత్(ఆర్సీఐ)ను అనుసంధానం చేసింది.
"రక్షణ, వ్యూహాత్మక సంస్థలకు సురక్షితమైన సమాచార మార్పిడి అత్యంత కీలకం. ఈ విషయంలో ఎన్క్రిప్షన్ కీలను ఎప్పటికప్పుడు మార్చడం చాలా అవసరం. ఎన్క్రిప్షన్ కీలను సురక్షితంగా పంపించుకొనేందుకు క్వాంటమ్ ఆధారిత కమ్యూనికేషన్ ఉపయోగపడుతుంది. టైమ్-బిన్ క్యూకేడీను ఉపయోగించి వాస్తవ పరిస్థితుల్లో క్వాంటమ్ కమ్యూనికేషన్‌ను పరీక్షించాం. సమాచారాన్ని మూడో వ్యక్తి గ్రహిస్తే గుర్తించే విధానాన్ని ప్రదర్శించాం."