దేశ సైనికుల అవసరాలకు తగిన విధంగా తేలికపాటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్(బీపీజే)ను తయారు చేసింది రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ). ఈ విషయాన్ని డీఆర్డీఓ అధికారులు మంగళవారం తెలిపారు.
డీఆర్డీఓకు చెందిన రక్షణ వస్తు నిల్వల పరిశోధన అభివృద్ధి విభాగం(డీఎంఎస్ఆర్డీఈ) తయారు చేసిన ఈ తొమ్మిది కిలోల ఫ్రంట్ హార్డ్ ఆర్మోర్ ప్యానెల్(ఎఫ్హెచ్ఏపీ) జాకెట్‌ను చండీగఢ్‌లోని టెర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చ్ లేబొరేటరీ(టీబీఆర్ఎల్)లో విజయవంతంగా పరీక్షించారు. దీనిని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్(బీఐఎస్) ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేసినట్లు అధికారులు తెలిపారు.