Draupadi Murmu Original Name: దేశ తొలి గిరిజన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేరు ఇప్పుడు ఆసేతు హిమాచలం మారుమోగుతోంది. అయితే ఇది ఆమె అసలు నామధేయం కాదు. ఒక టీచర్ ఆమెకు ఈ పేరు పెట్టారు. ముర్ముకు తల్లిదండ్రులు.. 'పుటి' అనే సంతాళీ పేరు పెట్టారు. ఆమె స్వస్థలం ఒడిశాలోని మయూర్‌భంజ్. ఈ జిల్లాలో గిరిజనులు ఎక్కువగా ఉండేవారు. 1960లలో అక్కడ పనిచేసిన టీచర్లలో ఎక్కువ మంది పొరుగు జిల్లాల వారే. 'పుటి' అధ్యాపకుడూ ఇలా వేరే ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తే. ఆయనకు ఈ పేరు నచ్చలేదు.
అందువల్ల మహాభారతంలోని ద్రౌపది పేరును తనకు పెట్టారని ఆమె ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ తర్వాత అది పలు సందర్భాల్లో 'దురుపది','దొర్పది'గా మారిందని, చివరికి ద్రౌపదిగా తిరిగి స్థిరపడిందని చెప్పారు. సంతాళి తెగలో అమ్మాయికి నానమ్మ పేరు, అబ్బాయికి తండ్రి పేరు పెట్టడం ఆనవాయితీ. మొదట్లో ఆమెకు 'తుడు' అనే ఇంటిపేరు ఉండేది. శ్యామ్ చరణ్ ముర్మును వివాహమాడాక ఆమె పేరు పక్కన ముర్ము చేరింది.
రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్ ఉండాలి
రాజకీయాల్లో పురుషాధిపత్యం ఎక్కువైందని ముర్ము ఓ సందర్భంలో పేర్కొన్నారు. పార్టీలు దీన్ని మార్చాలన్నారు. ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, టికెట్ల పంపిణీ విషయంలో ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. మహిళలు విలువలతో కూడిన రాజకీయాలపై దృష్టిసారించాలని కోరారు. సాధికారత కోసం పార్లమెంటు, అసెంబ్లీల్లో గొంతుక వినిపించాలని సూచించారు. ప్రజా సమస్యలను నిర్దిష్ట వేదికలపై ప్రస్తావించాలన్నారు.