తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేడే ద్రౌపదీ ముర్ము నామినేషన్.. జులై 1 నుంచి రాష్ట్రాల పర్యటన - draupadi murmu news telugu

Droupadi Murmu news: అధికార ఎన్డీఏ తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము శుక్రవారం నామపత్రాలు దాఖలు చేయనున్నారు. ముర్ము నామినేషన్​పై మోదీ, అమిత్ షా, రాజ్​నాథ్, నడ్డా, ఉత్తర్​ప్రదేశ్, ఉత్తరాఖండ్ సీఎంలు సంతకాలు చేయనున్నారు. దిల్లీకి చేరుకున్న ముర్ము.. ఉపరాష్ట్రపతి, ప్రధానిని కలిశారు.

Droupadi Murmu news
Droupadi Murmu news

By

Published : Jun 23, 2022, 6:23 PM IST

Updated : Jun 24, 2022, 6:38 AM IST

Droupadi Murmu nomination: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ద్రౌపదీ ముర్ము శుక్రవారం ఉదయం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరిస్తున్న రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ పీసీ మోదీకి ఆమె నామపత్రాలు సమర్పించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షా, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు, భాజపా, ఎన్డీయే రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మొదటగా ప్రధాని ఆమె పేరును ప్రతిపాదిస్తారు. నామినేషన్‌ పత్రాలను 50 మంది ఎలక్టోరల్‌ కాలేజీ సభ్యులు ప్రతిపాదించి, మరో 50 మంది బలపరచాల్సి ఉంది.

దిల్లీకి చేరుకున్న ముర్ము
నామపత్రాల దాఖలుకు ఒకరోజు ముందుగా గురువారమే దిల్లీకి చేరుకున్న ముర్ము ఒడిశా భవన్‌లో బస చేశారు. భువనేశ్వర్‌ విమానాశ్రయంలో పలు పార్టీల నాయకులు, అభిమానులు ఆమెకు వీడ్కోలు పలికారు. గిరిజన నృత్యాలతో, సంప్రదాయ దుస్తులతో వచ్చిన అభిమానులతో అక్కడంతా కోలాహలం కనిపించింది. దిల్లీకి చేరుకున్న అనంతరం ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌ షాతో ముర్ము భేటీ అయ్యారు. విమానాశ్రయం నుంచి నేరుగా ప్రధానమంత్రి నివాసానికి ఆమె వెళ్లి, తనను దేశ అత్యున్నత పదవికి అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ఆమె ఎంపికను సమాజంలోని అన్ని వర్గాలు ప్రశంసిస్తున్నాయని ప్రధాని ట్వీట్‌ చేశారు.

ఉత్తరాదికి ఎక్కువ సమయం
ఉత్తరాదిలో భాజపా, ఎన్డీయే పాలిత రాష్ట్రాలు, ఓటర్లు ఎక్కువగా ఉన్నందున ఎన్నికల ప్రచారానికి ద్రౌపది ఒక్కో రాష్ట్రంలో ఒక్కోరోజు కేటాయించే వీలుంది. ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరాఖండ్‌, ఝార్ఖండ్‌లలో ఎన్డీయే మద్దతుదారులను వాటి మాతృ రాష్ట్రాలైన మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌లకు ఆహ్వానించి మద్దతు కోరవచ్చని పేర్కొంటున్నారు. ముర్ము నామినేషన్‌, ఎన్నికల ప్రక్రియ ఇతర న్యాయపరమైన అంశాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి పర్యవేక్షిస్తున్నారు.

కేరళలో ముర్ముకి ఓట్లు రానట్లే!
కేరళ నుంచి ఎన్డీయే అభ్యర్థి ముర్ముకి ఒక్క ఓటు కూడా పడే అవకాశం లేదు. అక్కడ అధికార, విపక్ష కూటమి పార్టీలన్నీ ప్రతిపక్ష అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకే ఓటు వేయనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక స్థానాలున్న వైకాపా.. ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ప్రకటించినందువల్ల ఆ పార్టీ నుంచి యశ్వంత్‌సిన్హాకు ఒక్క ఓటైనా వచ్చే అవకాశం లేదు. నాగాలాండ్‌ అసెంబ్లీలో అంతా ఎన్డీయే కూటమి సభ్యులే కావడంతో అక్కడ ప్రతిపక్షానికి ఒక్క ఓటైనా దక్కే అవకాశం లేనట్లే. జమ్మూ-కశ్మీర్‌ శాసనసభ ఇంకా ఏర్పాటు కాకపోవడంతో ఈసారీ అక్కడి ప్రజాప్రతినిధులు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటువేసే అవకాశం కోల్పోతున్నారు.

యశ్వంత్‌ సిన్హాకే తెరాస ఓటు!
రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకే ఓటేయాలని తెరాస భావిస్తున్న విషయం తెలిసిందే. సిన్హాకు మద్దతు ఇవ్వాలని ఎన్సీపీ అధినేత పవార్‌ కోరిన నేపథ్యంలో తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక సమావేశం నిర్వహించి దీనిపై అధికారిక నిర్ణయం వెలువరించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

  • రాజకీయాలకు అతీతంగా గిరిజన శాసనకర్తలంతా ముర్ముకు మద్దతు ప్రకటించాలని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్‌ముండా పిలుపునిచ్చారు. ముర్మును ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని అఖిల భారతీయ వన్‌వాసీ కల్యాణ్‌ ఆశ్రమ్‌ అన్ని పార్టీలకూ విజ్ఞప్తి చేసింది.

రాష్ట్రపతి పదవికి అమ్మ వన్నె తెస్తారు: ఇతిశ్రీ
'అమ్మ విజయం తథ్యం, రాష్ట్రపతిగా ఆ పదవికి ఆమె వన్నె తెస్తారు' అని ద్రౌపదీ ముర్ము కుమార్తె ఇతిశ్రీ ముర్ము పేర్కొన్నారు. తన తల్లి ఎన్నో సవాళ్లను అధిగమించారన్నారు. ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుని రాజకీయాలకు దూరంగా ఉన్న సమయంలో ఈ ఉన్నతమైన అవకాశం వచ్చిందన్నారు. భువనేశ్వర్‌లో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఇతిశ్రీ ఒక బ్యాంకులో పని చేస్తున్నారు. నిరాడంబరంగా ఉంటూ మృదువుగా మాట్లాడే తన తల్లిని దేశ ప్రజలు ప్రేమిస్తున్నారని చెప్పారు. కుటుంబ బాధ్యతల్ని తనకు అప్పగించి, దేశ సేవ కోసం ఆమె దిల్లీకి వెళ్తున్నారని తెలిపారు. ముర్ముకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఆమెను కలిసి అభినందించారు. భువనేశ్వర్‌లో తాను చదువుకున్న బాలికల పాఠశాలకు ముర్ము వెళ్లాలనుకున్నా, ప్రజల తాకిడి వల్ల సాధ్యం కాలేదు.

రాష్ట్రాల పర్యటనను పర్యవేక్షించనున్న కిషన్‌రెడ్డి, షెకావత్‌
తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి రాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్‌ పత్రాన్ని బలపరుస్తూ సంతకం చేశారు. నామినేషన్‌ ప్రక్రియ సమయంలో ఒడిశా ప్రభుత్వం తరఫున ఇద్దరు మంత్రులు ఆమె వెంటే ఉండాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఆదేశించారు. త్వరలో రాష్ట్రాల్లో ద్రౌపది పర్యటించనున్నారు. ఆ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రులు గజేంద్రసింగ్‌ షెకావత్‌, కిషన్‌రెడ్డిలు పర్యవేక్షించనున్నారు. ప్రచారానికి సమయం తక్కువగా ఉన్నందున ఒక్కోరోజు రెండు రాష్ట్రాల్లో పర్యటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమైన రాష్ట్రాలకు ఒక్కోరోజు కేటాయించి, చిన్న రాష్ట్రాల్లోని ఓటర్లను ఒకే చోటుకు ఆహ్వానించి మద్దతు కోరాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తెలంగాణ భాజపా ఎంపీ, ఎమ్మెల్యేలను కర్ణాటకకు ఆహ్వానించి అక్కడే వారి మద్దతు కోరే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం ప్రత్యేకంగా వెళ్తారని సమాచారం. ఈశాన్య రాష్ట్రాల వారందరి కోసం గువాహటిలో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేస్తారు.

ఇదీ చదవండి:

Last Updated : Jun 24, 2022, 6:38 AM IST

ABOUT THE AUTHOR

...view details