Mamata Banerjee on Murmu: రాష్ట్రపతి ఎన్నికలపై బంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఆమెపై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించేందుకు కారణమయ్యాయి.
మమత ఏమన్నారు?:
"మహారాష్ట్రలో మారిన రాజకీయ పరిస్థితుల్ని బట్టి చూస్తే.. ప్రస్తుతం ద్రౌపది ముర్మూకు విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయి. అభ్యర్థిని ప్రకటించడానికి ముందు భాజపా మాతో చర్చించి ఉంటే.. విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ద్రౌపదికి మద్దతిచ్చే అంశాన్ని పరిశీలించే వాళ్లం. అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో ఒకే అభ్యర్థిని ఎంచుకోవడమే దేశానికి మంచిది.
మేము కూడా మహిళా అభ్యర్థిని నిలిపేందుకు ప్రయత్నించేవాళ్లం. 16-17 రాజకీయ పార్టీలు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాయి. నేను ఒంటరిగా నిర్ణయం తీసుకోలేను. రాష్ట్రపతి ఎన్నికలు శాంతియుతంగా జరగాలని కోరుకుంటున్నా. అన్ని మతాలు, జాతులను సమానంగా గౌరవిస్తా. ఇప్పుడు పోటీ జరుగుతున్నందుకు నాకు బాధగా ఉంది. కానీ.. దళితులు, గిరిజనులు అంతా మాకు అండగా ఉన్నారని నమ్ముతున్నా. ప్రజల మధ్య చీలికలు తేవాలని మేము కోరుకోవడం లేదు" అని కోల్కతాలో రథయాత్ర కార్యక్రమం సందర్భంగా విలేకర్లతో చెప్పారు మమతా బెనర్జీ. విపక్షాల ఉమ్మడి నిర్ణయం ఆధారంగానే తాను ముందుకెళ్తానని స్పష్టం చేశారు.