బంగాల్లోని కోల్‌కతాలో బ్రెయిన్ డెడ్‌తో మరణించిన వ్యక్తి.. ఏడుగురి జీవితాల్లో వెలుగులు నింపారు. మరణించిన వ్యక్తి అవయవాలను ఆయన కుటుంబసభ్యులు దానం చేశారు. దీంతో వైద్యులు.. ఏడుగురి ప్రాణాలను కాపాడారు.
అసలేం జరిగిందంటే..
పూర్బ బర్ద్వాన్లోని హత్గోబింద్పుర్లో నివసిస్తున్న హిరణ్మోయ్ ఘోషల్(54) నాటకీయరంగంలో సుప్రసిద్ధుడు. ఆయన బుధవారం మధ్యాహ్నం డైనింగ్ హాల్లో అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు స్కానింగ్ చేసి ఆయన మెదడులో బ్లడ్ క్లాట్ అయినట్లు గుర్తించారు. అనంతరం అతడి పరిస్థితి విషమించడం వల్ల మరో ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఘోషల్‌కు శస్త్ర చికిత్స చేసే పరిస్థితి లేనందున లైఫ్ సపోర్ట్ సిస్టమ్ పెట్టారు. అది జరిగిన మరుసటి రోజే ఆయన బ్రెయిన్ డెడ్‌తో మృతి చెందారు.
బ్రెయిన్ డెడ్‌తో మృతి చెందటం వల్ల ఘోషాల్ మిగిలిన శరీర భాగాలు బాగానే ఉన్నాయి. దీంతో ఘోషల్ అవయవాలను దానం చేయాలని కుటుంబసభ్యులు నిర్ణయించుకున్నారు. వెంటనే ఘోషల్ కార్నియా, కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, గుండెను కుటుంబసభ్యులు దానం చేశారు. అనంతరం మృతదేహాన్ని ఇంటికి తరలించారు.